పెళ్లి ఆగిపోతే ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తారు.. కానీ మందాన మాత్రం..

సాధారణంగా ప్రేమ విఫలమైతేనో, పెళ్లి ఆగిపోతేనో ఎవరైనా కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఆ బాధ నుంచి బయటపడటానికి నెలల సమయం పడుతుంది. కానీ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మాత్రం తాను అందరిలా కాదని నిరూపించుకుంది. ఆదివారం నాడు “నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది” అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆమె, సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే బ్యాట్ పట్టి గ్రౌండ్‌లో దిగింది. ఆమె సోదరుడు శ్రవణ్ మంధాన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రాక్టీస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వ్యక్తిగత జీవితంలో ఇంత పెద్ద కుదుపు వచ్చినా, స్మృతి తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. త్వరలో శ్రీలంకతో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ వెంటనే వచ్చే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) కోసం ఆమె అప్పుడే సన్నద్ధమవుతోంది. ఇంట్లో కూర్చుని బాధపడటం కంటే, గ్రౌండ్‌లో చెమటోడ్చడమే బెటర్ అని ఆమె డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఆమె మానసిక ధైర్యాన్ని, క్రికెట్ పట్ల ఉన్న అంకితభావాన్ని చూసి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. “వేరే వాళ్లయితే కోలుకోవడానికి నెలలు పట్టేది, స్మృతి నువ్వు నిజంగా గ్రేట్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

వాస్తవానికి నవంబర్ 23న పలాష్ ముచ్చల్‌తో స్మృతి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ తండ్రి అనారోగ్యం, ఇతర కారణాల వల్ల మొదట వాయిదా పడింది. ఇక ఆ తరువాత అది రద్దయింది. అసలు విషయం చెప్పకపోయినా స్మృతి చాలా హుందాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. “మా ప్రైవసీని గౌరవించండి, ఇకపై నా ఫోకస్ అంతా దేశం కోసం ట్రోఫీలు గెలవడం మీదే ఉంటుంది” అని క్లారిటీ ఇచ్చారు. చెప్పినట్లుగానే మరుసటి రోజే ప్రాక్టీస్ కి వచ్చి తన మాటను నిలబెట్టుకున్నారు.

ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో స్మృతి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. 434 పరుగులతో టోర్నీలోనే రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఇప్పుడు వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి, అదే జోష్‌ను రాబోయే సిరీస్‌లలోనూ చూపించాలని పట్టుదలగా ఉంది. ఆటను నమ్ముకున్న వారికి ఆటే అసలు కిక్ అని స్మృతి మరోసారి రుజువు చేసింది. ఆమె రీఎంట్రీ యువ క్రీడాకారులకు ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ అనడంలో సందేహం లేదు.