అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. సామూహిక వలసలు అమెరికా కలలను నాశనం చేస్తున్నాయని, ఇక్కడి ఉద్యోగాలను వాళ్లు దొంగిలిస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. వేరే దేశాల నుంచి వచ్చే వారి వల్ల అమెరికన్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.
వాన్స్ ఇలా అనగానే నెటిజన్లు ఆయన భార్య ఉషా వాన్స్ గురించి గుర్తు చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఉషా వాన్స్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు వలసదారులే. మీరు వలసలను ఇంతలా ద్వేషిస్తున్నారు కదా, మరి మీ భార్య కూడా ఇండియన్ కదా అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. వలసదారులు దేశాన్ని దోచుకుంటున్నారని అంటున్న మీరు, మీ ఇంట్లో ఉన్న వలసదారుల గురించి ఏమంటారు అని నిలదీస్తున్నారు.
నెటిజన్లు ఆయనపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ముందు మీ భార్యను, మీ పిల్లలను ఇండియాకు పంపించేయండి. అప్పుడు మీరు ఆదర్శంగా నిలిచినట్లు ఉంటుంది అని ఒకరు కామెంట్ చేశారు. మీ పిల్లలు కూడా సగం వలసదారులే కదా, వాళ్లు అమెరికా కలలను దొంగిలించడం లేదా అని ఘాటుగా విమర్శిస్తున్నారు. రాజకీయాల కోసం సొంత భార్యను, ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడతారా అని మరికొందరు మండిపడుతున్నారు.
వాన్స్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా మన జాతి, మన రంగు ఉన్న పక్కవాళ్లతోనే మనం నివసించడానికి ఇష్టపడతాం అని ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపాయి. వేరే సంస్కృతి వాళ్లు మన పక్కన ఉంటే ఇబ్బందిగా ఉంటుందని ఆయన అనడంపై అప్పుడే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వలసదారుల గురించి మాట్లాడి మరోసారి బుక్ అయ్యారు.
ఒకపక్క వలసదారుల కుమార్తెను పెళ్లి చేసుకుని, మరోపక్క వలసలకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వంద్వ వైఖరి అని జనం అంటున్నారు. లూసియానాలో వలస కూలీలు వెళ్లిపోవడం వల్ల స్థానికులకు పని దొరుకుతుందని ఆయన సంతోషపడ్డారు. కానీ ఆ వ్యాఖ్యలు చివరకు ఆయన సొంత ఇంటి వైపే వేలెత్తి చూపించేలా చేశాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates