చేతికి వచ్చే జీతం తగ్గుతుందా? పీఎఫ్ పెరుగుతుందా?

దేశంలో ఎప్పటి నుంచో గజిబిజిగా ఉన్న 29 రకాల పాత కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం చెత్తబుట్టలో వేసి, వాటి స్థానంలో కేవలం 4 కొత్త ‘లేబర్ కోడ్స్’ తీసుకొచ్చింది. సంక్లిష్టంగా ఉన్న రూల్స్‌ని సింపుల్ చేసి, కంపెనీలకు, ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వడమే దీని ఉద్దేశం. వేజెస్ (జీతాలు), ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, సేఫ్టీ కోడ్.. ఇవే ఆ నాలుగు కొత్త పిల్లర్లు. ఇది కేవలం కంపెనీల కోసమే కాదు, ఏసీ రూమ్‌లో కూర్చునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రోడ్డు మీద తిరిగే స్విగ్గీ డెలివరీ బాయ్ వరకు అందరి జీవితాలను మార్చేసే అతిపెద్ద సంస్కరణ ఇది.

ఉద్యోగులకు అత్యంత ఆసక్తి కలిగించే విషయం.. జీతం! కొత్త రూల్స్ ప్రకారం, మీ మొత్తం జీతంలో (CTC) ‘బేసిక్ పే’ కనీసం 50% ఉండాల్సిందే. ఇన్నాళ్లు కంపెనీలు అలవెన్సుల పేరుతో బేసిక్ పే తగ్గించి చూపించేవి. కానీ ఇకపై అది కుదరదు. బేసిక్ పే పెరిగితే ఆటోమేటిక్‌గా పీఎఫ్, గ్రాట్యుటీ కటింగ్స్ పెరుగుతాయి. దీనివల్ల ప్రతి నెలా మీ చేతికి వచ్చే ‘టేక్ హోమ్’ జీతం కాస్త తగ్గుతుంది. కానీ, పాజిటివ్ ఏంటంటే.. మీ రిటైర్మెంట్ సేవింగ్స్ PF భారీగా పెరుగుతాయి. అంటే ఈరోజు జేబు కాస్త ఖాళీ అయినా, భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నమాట.

కంపెనీల విషయానికి వస్తే, ఈ కొత్త రూల్స్ వాళ్లకు పెద్ద రిలీఫ్. ముఖ్యంగా 300 మంది వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలు, ఇకపై ప్రభుత్వం పర్మిషన్ లేకుండానే లే ఆఫ్స్ ప్రకటించవచ్చు లేదా కంపెనీని మూసివేయవచ్చు. ఇంతకుముందు ఈ లిమిట్ 100 మందికే ఉండేది. ఇది బిజినెస్ చేయడానికి ఈజీగా ఉంటుందని యాజమాన్యాలు సంబరపడుతుంటే, ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా మారుతుందని యూనియన్లు ఆందోళన చెందుతున్నాయి. అంటే కంపెనీలకు ‘హైరింగ్ అండ్ ఫైరింగ్’ పవర్ మరింత పెరిగిందన్నమాట.

ఈ మార్పుల్లో అతిపెద్ద విషయం ‘గిగ్ వర్కర్స్’కి గుర్తింపు దక్కడం. స్విగ్గీ, జొమాటో, ఊబర్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పనిచేసే వారికి ఇన్నాళ్లు చట్టపరంగా ఎలాంటి హక్కులు లేవు. ఇప్పుడు తొలిసారిగా వారిని కూడా ‘వర్కర్స్’గా గుర్తించి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పరిధిలోకి తెచ్చారు. అలాగే, మహిళలు ఇకపై నైట్ షిఫ్ట్‌లలో కూడా పని చేయవచ్చు. కాకపోతే, వారికి సరైన భద్రత కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా కంపెనీదే. ఇది మహిళా ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుంది.

మరో గుడ్ న్యూస్ ఏంటంటే, కాంట్రాక్ట్ లేదా ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులు గ్రాట్యుటీ కోసం ఐదేళ్లు ఎదురుచూడాల్సిన పనిలేదు. కేవలం ఏడాది పనిచేశాక మానేసినా గ్రాట్యుటీ పొందే అర్హత లభిస్తుంది. మొత్తానికి ఈ కొత్త లేబర్ కోడ్స్ మన వర్క్ కల్చర్‌ని డిజిటల్ ఎకానమీకి తగ్గట్టు మోడ్రన్‌గా మార్చడానికి చేసిన ప్రయత్నం. రాష్ట్రాలు కూడా తమ రూల్స్ సెట్ చేసుకుని దీన్ని అమల్లోకి తెస్తే, మన పే స్లిప్పుల్లో, ఆఫీసు రూల్స్‌లో భారీ మార్పులు చూడటం ఖాయం.