భార్యకు ‘మెర్క్యురీ’ ఇంజెక్షన్.. 9 నెలల నరకం తర్వాత మృతి!

బెంగళూరు సమీపంలోని అత్తిబెలేలో జరిగిన ఒక దారుణమైన ఘటన ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపడానికి ఒక భర్త ఎంచుకున్న మార్గం వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. విద్యా అనే మహిళ తొమ్మిది నెలల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయింది. తన భర్త బసవరాజ్, మామ మారిస్వామాచారి కలిసి తనకు మెర్క్యురీ (పాదరసం) ఇంజెక్షన్ ఇచ్చి చంపారని ఆమె చనిపోయే ముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది.

విద్యా, బసవరాజ్‌ దంపతులు.. పెళ్లైనప్పటి నుంచి విద్యాకు కష్టాలు మొదలయ్యాయి. భర్త, మామ కలిసి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవారట. ఆమెకు పిచ్చి ఉందని ముద్ర వేసి, ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా గదిలో బంధించి చిత్రహింసలు పెట్టేవారు. బంధువుల ఇంటికి కూడా వెళ్లనిచ్చేవారు కాదు. ఈ వేధింపుల పర్వం చివరకు హత్యాయత్నానికి దారి తీసింది.

అసలు ఘోరం ఈ ఏడాది శివరాత్రి (ఫిబ్రవరి 26) రాత్రి జరిగింది. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న విద్యాకు తొడ భాగంలో ఏదో సూదితో గుచ్చినట్లు అనిపించి మెలకువ వచ్చింది. కానీ మరుసటి రోజు సాయంత్రం వరకు ఆమె స్పృహలోకి రాలేదు. ఆ తర్వాత కాలు విపరీతంగా లాగడంతో ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ చేసిన టెస్టుల్లో షాకింగ్ నిజం బయటపడింది. ఆమె శరీరంలో ప్రమాదకరమైన మెర్క్యురీ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసినా ఫలితం లేకపోయింది.

అప్పటి నుంచి విద్యా నరకం అనుభవించింది. ఆక్స్‌ఫర్డ్ ఆసుపత్రి నుంచి విక్టోరియా ఆసుపత్రికి మార్చినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. మెర్క్యురీ విషం రక్తం ద్వారా శరీరమంతా పాకింది. దీనివల్ల ఆమె కిడ్నీలు, ఇతర అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. డయాలసిస్ మీద ఉంటూ తొమ్మిది నెలల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె, శనివారం (నవంబర్ 23) పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాక కన్నుమూసింది. పలు కారణాలతోనో భర్త, మామ కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెకు విషం ఎక్కించారని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అత్తిబెలే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆమెను ఎందుకు చంపారు అనే విషయంలో లోతుగా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.