చీమలంటే ఆమెకు భయం.. ఆ భయమే ఆమెను ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పింది. నమ్మడానికి ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాలో చీమలంటే భయంతో పాతికేళ్ల మనీషా సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. కూతురిని ఒంటరిని చేసి తనువు చాలించింది. నన్ను క్షమించండి.. ఈ చీమలతో బతకడం నావల్ల కావట్లేదు.. అంటూ ఆమె తన చివరి లేఖలో పేర్కొంది. మానసిక ఆరోగ్యం, ఫోబియాలకు చికిత్స ఎంత అవసరమో ఈ విషాదకర ఘటన మరోసారి గుర్తు చేసింది.
కొందరికి చీమలంటే భయం.. మరికొందరికి బల్లులు, బొద్దింకలు, సాలీడులు అంటే వణుకు. ఇవన్నీ సహజంగా ఉండేవే. దాదాపు ఇటువంటివి 300 వరకు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఆత్మహత్య చేసుకునేంతగా ఈ ఫోబియా ఉంటుందా అంటే అవుననే అంటున్నారు సైకాలజిస్టులు. చిన్న భయం సరైన కౌన్సిలింగ్ తీసుకోకపోతే ఎటువంటి పర్యవసానాలకు దారి తీస్తుందే ఈ ఘటన నిరూపిస్తుంది. చీమల ఫోబియాను మైర్మెకోఫోబియా అని కూడా పిలుస్తారు. ఇది పుట్టుకతో వచ్చే అవకాశం లేదు. వారి జీవితంలో జరిగే సంఘటనల కారణంగా రావచ్చని చెబుతున్నారు. ఎటువంటి ఫోబియా అయినా రావడానికి బాల్యంలో ఎదురయ్యే ఘటనలు కారణం కావచ్చు. ముందుగానే దీనిని గుర్తించి కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ కృష్ణభరత్ తెలిపారు.
మన కంటికి చీమ చిన్నదిగా కనిపించవచ్చును కానీ అటువంటి ఫోబియా ఉన్నవారి మైండ్పై ఆ తీవ్రత ప్రభావం కనిపిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఫోబియా పబ్లిక్లో మాట్లాడడం. ఆ తర్వాత చీకటి అంటే భయపడడం, ఎత్తు ప్రదేశాలు అంటే భయపపడం వంటి ఉన్నాయని తెలిపారు. ప్రారంభ దశలోనే ఇటువంటి ఫోబియాలను తగ్గించవచ్చు అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates