సాఫ్ట్ వెర్ ఇంజనీర్లకు మళ్ళీ వ్యవసాయమే దిక్కా..?

ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో జరుగుతున్న పరిణామాలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు రీస్కిల్లింగ్ పేరుతో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. అక్సెంచర్ ఇటీవలే 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, పుణేలో మాత్రమే టీసీఎస్ దాదాపు 2,500 మందిని రాజీనామా చేయించిందనే వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితులు ఐటీ రంగంలోని స్థిరత్వంపై ప్రశ్నలు రేపుతున్నాయి. 

ఫలితంగా, ఇప్పటికే కొంతమంది ఐటీ ఉద్యోగులు వ్యవసాయ రంగంలోకి మళ్లిపోతుండగా, రానున్న రోజుల్లో ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐటీ రంగం ఎప్పుడూ ప్రఖ్యాతి గాంచింది. అధిక వేతనాలు, సౌకర్యాలు, అంతర్జాతీయ అవకాశాలు ఈ రంగం ఆకర్షణ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నిరంతర ఒత్తిడి, డెడ్‌లైన్ల భారం, మానసిక ఆరోగ్య సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 

శారీరకంగా కూడా అనేక సమస్యలు తలెత్తుతుండటంతో, కొంతమంది యువతకు వ్యవసాయం మళ్ళీ సరైన మార్గంగా అనిపిస్తోంది. కనీసం వ్యవసాయంలో మనసుకు ప్రశాంతత ఉంటుందని వారు భావిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ధోరణి మరింత పెరగవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. “2029-2030 నాటికి ఐటీ రంగంలో మార్పులు, ఆరోగ్య సమస్యల కారణంగా అనేక మంది యువత వ్యవసాయాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది” అని అధ్యయనాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం శ్రమతో కూడుకున్నప్పటికీ, వ్యవసాయం మానసికంగా సంతృప్తినిచ్చే వృత్తిగా భావించబడుతోంది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రిటెక్ వంటి కొత్త అవకాశాలు కూడా వ్యవసాయాన్ని మళ్ళీ ఆకర్షణీయ రంగంగా మార్చుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. కొందరు పల్లెల్లో పంటలు పండిస్తుండగా, మరికొందరు పాలు, పశుపోషణ, ఆక్వాకల్చర్ వంటి రంగాల్లో అడుగుపెడుతున్నారు. 

టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న ఈ యువ రైతులు కొత్త పద్ధతులను అమలు చేస్తూ, వ్యవసాయంలో మార్పులు తెస్తున్నారు. ఇదే కారణంగా “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు రైతులైతే కొత్త విప్లవం రావచ్చు” అని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఐటీ రంగంలో అనిశ్చితులు పెరుగుతున్న వేళ, వ్యవసాయం మళ్ళీ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతోంది. డబ్బు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతి, ఆరోగ్యం కూడా ముఖ్యమని ఈ యువత గ్రహిస్తోంది.