షేక్ హ్యాండ్ గొడ‌వ‌.. బాయ్‌కాట్‌కు సిద్ధ‌మైన పాక్

ఆసియా క‌ప్ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భార‌త జ‌ట్టు.. మ్యాచ్ అనంత‌రం వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టాస్ సంద‌ర్భంగా భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్, పాకిస్థాన్ సార‌థి స‌ల్మాన్ అఘా ఒక‌రితో ఒక‌రు క‌ర‌చాల‌నం చేసుకోలేదు. టాస్ వేయ‌గానే గెలిచిన కెప్టెన్‌కు అవ‌త‌లి .జ‌ట్టు సార‌థి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం ఆన‌వాయితీ. కానీ నిన్న సూర్య‌కుమార్ చేతులుక‌ట్టుకుని ప‌క్క‌కు వెళ్లిపోయాడు త‌ప్ప స‌ల్మాన్‌తో చేయి క‌ల‌ప‌లేదు.

ఇక మ్యాచ్ అనంత‌రం కూడా భార‌త ఆట‌గాళ్లెవ్వ‌రూ పాక్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌లేదు. శివ‌మ్ దూబెతో క‌లిసి సూర్య‌నే మ్యాచ్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్ కొట్ట‌గానే అత‌ను, దూబెతో క‌లిసి నేరుగా పెవిలియ‌న్ వైపు వెళ్లిపోయాడు. మ్యాచ్ అనంత‌రం బ్యాటింగ్ జ‌ట్టు.. మైదానంలోకి వ‌చ్చి ఫీల్డింగ్ టీంకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం ఆన‌వాయితీ. కానీ భార‌త జ‌ట్టు త‌లుపులు మూసుకుని లోప‌లే ఉండిపోయింది. ఇండియ‌న్ టీం కోసం కాసేపు ఎదురు చూసిన పాకిస్థాన్ ఆట‌గాళ్లు.. వెళ్లిపోయారు. దీనికి హ‌ర్ట‌యిన పాకిస్థాన్ కెప్టెన్ ప్రెజెంటేష‌న్ కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన‌లేదు.

అస‌లే ఓట‌మి భారంతో ఉన్న పాకిస్థాన్‌కు త‌మ‌తో భార‌త ఆట‌గాళ్లు వ్య‌వ‌హ‌రించిన తీరు అవ‌మాన‌క‌రంగా అనిపించింది. నిన్న రాత్రి నుంచి పాకిస్థానీల గోల మామూలుగా లేదు. ఇండియ‌న్ టీం మీద తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇది స్పిరిట్ ఆఫ్ ద గేమ్‌కు వ్య‌తిరేకం అంటున్నారు. వాళ్ల ఫ్ర‌స్టేష‌న్‌ను రెట్టింపు చేస్తూ.. ఈ విజ‌యాన్ని ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి బాధితుల‌కు, ఆప‌రేష‌న్ సిందూర్‌ను విజ‌య‌వంతం చేసిన సైన్యానికి సూర్య‌కుమార్ అంకితం ఇచ్చాడు. దీంతో వ్య‌వ‌హారం రాజ‌కీయ రంగు పులుముకుంది. ఇది చూసి త‌ట్టుకోలేక‌పోయిన పాకిస్థాన్‌.. టాస్ స‌మ‌యంలో, మ్యాచ్ అనంత‌రం క‌ర‌చాల‌నాలు చేయించ‌క‌పోవ‌డానికి బాధ్యుడిని చేస్తూ మ్యాచ్ రిఫ‌రీ పైక్రాఫ్ట్‌ను తొల‌గించాల‌ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు ఫిర్యాదు చేసింది.

అత‌ణ్ని త‌ప్పించ‌క‌పోతే ఆసియా క‌ప్‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చరించింది. ఏసీసీ ప్రెసిడెంట్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ అయిన న‌ఖ్వీనే కావ‌డంతో అత‌ను.. పైక్రాఫ్ట్ విష‌యంలో ఏం చేస్తాడో చూడాలి. పైక్రాఫ్ట్‌ను త‌ప్పిస్తే భార‌త జ‌ట్టు, బీసీసీఐ ఊరుకుంటాయా అన్న‌ది ప్ర‌శ్న‌. అస‌లీ టోర్నీ అంత‌టా భార‌త ఆట‌గాళ్లు.. పాకిస్థాన్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్స్ ఇవ్వ‌కూడ‌ద‌నే ఫిక్స‌య్యార‌ట‌. అంతే కాక ఆసియా క‌ప్ గెలిస్తే ఏసీసీ ప్రెసిడెంట్ న‌ఖ్వి చేతుల మీదుగా ట్రోఫీని కూడా తీసుకోకూడ‌ద‌ని కూడా నిర్ణ‌యించార‌ట‌. మొత్తానికి షేక్ హ్యాండ్ వివాదం చాలా దూర‌మే వెళ్లేట్లే క‌నిపిస్తోంది.