ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు సెప్టెంబరు 15తోనే ముగుస్తుందని కేంద్రం స్పష్టంగా తెలిపింది. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో ఈ గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారనే వార్తలు వైరల్ అవుతున్నా, అవన్నీ నకిలీ సమాచారం మాత్రమేనని ఆదాయపు పన్ను విభాగం ఖండించింది. ఇప్పటికే జూలై 31 వరకు ఉన్న గడువును ఒకసారి పొడిగించి సెప్టెంబరు 15 వరకు తీసుకొచ్చామని, ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను ఫైల్ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో 5.51 కోట్ల రిటర్నులు ఇ-వెరిఫై కాగా, 3.78 కోట్ల వరకు పరిశీలన పూర్తయిందని అధికారులు వెల్లడించారు. రూ.3 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా ఐటీఆర్ సమర్పించాలని సూచించారు. కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది లాభదాయకమో జాగ్రత్తగా పరిశీలించి దాఖలు చేయాలని పన్ను శాఖ గుర్తు చేసింది.
అయితే, గడువులోగా రిటర్నులు దాఖలు చేయని వారికి పెనాల్టీ తప్పదని హెచ్చరిక వచ్చింది. పైగా రీఫండ్ కోసం తప్పుడు మినహాయింపులు చూపిస్తే అది తరువాత నోటీసులకు, జరిమానాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫేక్ న్యూస్ నమ్మొద్దని, ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్‌డేట్స్ మాత్రమే నమ్మాలని పన్ను చెల్లింపుదారులకు సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24×7 హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉందని ఐటీ శాఖ తెలిపింది. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్, ఎక్స్ ఖాతా ద్వారా పన్ను చెల్లింపుదారుల సందేహాలను నివృత్తి చేయనున్నట్లు పేర్కొంది. దీంతో పన్ను చెల్లింపుదారులు చివరి రోజున గందరగోళం కాకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates