హైదరాబాదీ క్రికెటర్ పరిస్థితి దయనీయం

మహ్మద్ సిరాజ్.. చాలా ఏళ్లుగా మెరుపులు లేని హైదరాబాద్ క్రికెట్లో ఏకైక ఆశాకిరణంగా చెప్పొచ్చు. వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారి లాంటి క్రికెటర్ల తర్వాత ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాడతను. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా.. సహజ ప్రతిభతో అతను ఆ స్థాయికి చేరుకున్నాడు. అతను క్రికెటర్‌గా ఈ స్థాయికి చేరడంలో కీలక పాత్ర పోషించింది తండ్రి. ఆ తండ్రి ఇప్పుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. శుక్రవారం తుది శ్వాస విడిచాడు. ఐతే తండ్రిని కడసారి చూపు చూసే అవకాశం సిరాజ్‌కు లేకపోయింది.

సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఐపీఎల్ ముగించుకున్నాక. భారత క్రికెట్ జట్టుతో పాటు అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిపోయాడు. అక్కడ క్వారంటైన్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో తండ్రి చనిపోయాడు. చాన్నాళ్ల తర్వాత భారత జట్టులో అవకాశం దక్కింది సిరాజ్‌కు. ఇప్పుడు పర్యటన విరమించుకుని రాలేని పరిస్థితి. స్వదేశానికి వచ్చేస్తే సిరీస్‌కు దూరం కావాల్సిందే. మళ్లీ వెళ్లి క్వారంటైన్లో వ్యవధిని పూర్తి చేశాక కానీ జట్టుతో కలవలేడు. అప్పటికి సిరీస్ అయిపోతుంది. అతను స్వదేశానికి వచ్చే వరకు కూడా తండ్రి పార్థివ దేహాన్ని ఉంచే పరిస్థితి లేకపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేసేస్తున్నారు. సిరాజ్ తండ్రి ఆటోవాలా కావడం గమనార్హం. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదు. తమ కుటుంబ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోయినా కొడుకును క్రికెట్లో ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేశాడు. అలాంటి తండ్రి చనిపోతే కడసారి చూపుకు నోచుకోలేకపోవడం దయనీయమే.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)