చాట్ జీపీటీతో జర భద్రం

చాట్ జీపీటీపై ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ చేసిన తాజా వ్యాఖ్యలుకు ప్రపంచవ్యాప్తంగా యూజర్లు షాక్‌కు గురవుతున్నారు. ఇప్పటివరకు ‘రహస్యంగా ఉండే’ టెక్నాలజీగా భావించబడిన చాట్ జీపీటీ వేదికపై షేర్ చేస్తున్న సమాచారాన్ని అవసరమైతే బయటపెడతామని ఆయనే స్వయంగా ప్రకటించారు. ముఖ్యంగా న్యాయపరమైన అంశాల్లో కోర్టు ఆదేశాలు వస్తే, యూజర్ల డేటాను బయటపెడతామని ఆయన స్పష్టంగా చెప్పారు.

చాట్ జీపీటీ ఉపయోగిస్తున్నప్పుడు చాలా మంది వ్యక్తిగత చర్చలు, ఐడియాలు, ఫొటోలు కూడా షేర్ చేస్తుంటారు. అలాంటి సమాచారం పక్కకు పోతుందనే నమ్మకంతో యూజర్లు పలు సున్నితమైన అంశాలను కూడా చాట్‌బాట్‌తో పంచుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆల్ట్‌మన్ చేసిన ప్రకటన తర్వాత, యూజర్ల గోప్యతపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

“మీరు చాట్ జీపీటీతో పంచుకునే సమాచారాన్ని అవసరమైతే కోర్టు ఆదేశాలతో బయటపెడతాం. న్యాయపరమైన విషయంలో రహస్యంగా ఉంచడం సాధ్యపడదు. కానీ, సాధారణ పరిస్థితుల్లో 30 రోజుల తర్వాత ఆ చాట్స్, ఫొటోలను శాశ్వతంగా డిలీట్ చేస్తాం” అని ఆల్ట్‌మన్ వివరించారు. అంటే, కొన్ని రోజులు ఆ డేటా నిల్వ ఉండే అవకాశం ఉంది.

మరోవైపు, డేటా గోప్యత విషయంలో ఇప్పటి వరకూ చాట్ జీపీటీపై ఉన్న విశ్వాసం ఇలా బలహీనపడుతుందా అనే చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే చాలామంది వాణిజ్య వ్యూహాలు, స్టార్టప్ ఐడియాలు, వ్యక్తిగత రచనలు కూడా చాట్ జీపీటీతో పంచుకుంటారు. అలాంటి సందర్భాల్లో వాటిని భద్రంగా ఉంచుతారనే నమ్మకంతోనే వాడకం పెరుగుతోంది. ఆల్ట్‌మన్ వ్యాఖ్యల నేపథ్యంలో, యూజర్లు ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. సున్నితమైన డేటా, వ్యక్తిగత విషయాలను ఈ వేదికపై పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలంటున్నారు.