తత్కాల్ టికెట్ వేగం పెంచినందుకు జైలు శిక్ష

రైల్వే ప్రయాణికులకు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎంత స్పీడున్న ఇంటర్నెట్ కనెక్ట్ చేసినా సరే.. టికెట్ బుక్ అవుతుందన్న గ్యారెంటీ ఉండదు. టికెట్ బుక్ చేస్తుండగా.. బెర్తులు అందుబాటులో ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ ట్రాన్సాక్షన్ అయ్యేసరికి వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది. మధ్యలో ఇంకా ఏవేవో సమస్యలు తలెత్తుతాయి. తత్కాల్ టైంలో అసలు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ కావడమే పెద్ద సమస్య అవుతుంటుంది కొన్నిసార్లు.

ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నించిన ఓ ఐఐటీయెన్ జైలు పాలవ్వాల్సి రావడం విచారకరం. ఆ కుర్రాడి పేరు యువరాజా. కేరళకు చెందిన ఈ 32 ఏళ్ల కుర్రాడు.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్నాడు. అక్కడి నుంచి బయటికొచ్చాక ఉపాధి కోసం అనేక పనులు చేస్తూ వచ్చాడు.

యువరాజాకు కొత్త కొత్త యాప్స్ తయారు చేయడం అలవాటు. ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేయడానికి జనాలు పడే అవస్థలు చూసి వేగంగా పని చేసే, సులువుగా టికెట్ బుక్ చేయగలిగే యాప్ తయారు చేయాలనుకున్నాడు. కష్టపడి ‘సూపర్ తత్కాల్’, ‘సూపర్ తత్కాల్ ప్రో’ పేర్లతో రెండు యాప్‌లు తయారు చేశాడు. వాటిని గూగుల్ ప్లే స్లోర్ కూడా ఆమోదించింది. ఈ యాప్‌ల గురించి తెలిసిన వాళ్లు వాటి ద్వారా సులువగా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు. టికెట్ల డబ్బులేమో రైల్వేకే వెళ్లాయి. కానీ ఈ యాప్‌ల గురించి తెలుసుకున్న రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్‌ల సృష్టికర్త అయిన యువరాజా అడ్రస్ కనుక్కుని కేరళలోని తిరుప్పూర్‌లోని అతడి ఇంటికి రైల్వే పోలీసులు వచ్చేశారు.

సెప్టెంబరు 23న అతణ్ని అరెస్టు చేశారు. అనధికారికంగా రైల్వే టికెట్లను విక్రయించినందుకు యువరాజాపై కేసు పెట్టారు. జైలుకు పంపారు. నెలన్నర పాటు జైల్లో ఉండి ఇటీవలే బయటికొచ్చాడు యువరాజా. జనాలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే తానీ యాప్‌లను తయారు చేశానని, తన యాప్‌లను చూసి రైల్వే శాఖ తనను సంప్రదిస్తుందని అనుకున్నానని.. దీని పరిణామాలు తాను ఊహించలేదని.. కానీ తన సదుద్దేశాలను ఇప్పటికైనా రైల్వే అధికారులు అర్థం చేసుకోవాలని యువరాజా అంటున్నాడు. అతడి గురించి నేషనల్ మీడియాలో పాజిటివ్ ఆర్టికల్స్ వస్తుండటం విశేషం.