సోషల్ మీడియా పోస్టులు.. వాటిపై కేసులు ఉండ‌వ్‌!

సోష‌ల్ మీడియాలో వ్య‌క్తులు చేసే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు వంటివాటిపై ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున కేసులు న‌మోదవుతున్నాయి. జైళ్ల‌లో పెడుతున్నారు. ఏపీ విష‌యానికి వ‌స్తే.. 2019 నుంచి కూడా సోష‌ల్ మీడియా వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌ల‌పై కేసులు న‌మోదు కావ‌డం.. జైళ్ల‌లో పెడుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. సోష‌ల్ మీడియాను భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌లో కీల‌క భాగ‌మ‌ని పేర్కొంది. ఆర్టిక‌ల్ 19 ప్ర‌కారం సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు విధించేందుకు వీల్లేద‌ని కూడా సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

ఢిల్లీకి చెందిన స్వ‌చ్ఛంద సంస్థ దాఖ‌లు చేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు.. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను కొన్ని కార‌ణాల‌తో బందీచేయ‌డానికి వీల్లేద‌ని కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా న‌మోదైన సోష‌ల్ మీడియా కేసుల‌ను త‌క్ష‌ణ‌మే ఎత్తివేసేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.

సోషల్ మీడియా పోస్టుల మీద ఇకపై కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. ఆ పోస్టుల ఆధారంగా శిక్షలు కూడా వేయొద్దని స్ప‌ష్టం చేసింది. ఢిల్లీలోని బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. కొంద‌రు సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్ల కింద‌ట‌.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రోడ్డుపై ఉన్న ఆవుల‌ను తొలారు. ఇలా ఒక‌టి రెండు సార్లు ఆమె ఆవుల‌ను తోల‌డంతో దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈనేప‌థ్యంలో పోలీసులు కేసులు పెట్టి.. వారిని జైళ్ల‌లోకి నెట్టారు.

ఈ వ్య‌వ‌హారంపైనే ఒక స్వ‌చ్ఛంద సంస్థ‌.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా.. సోష‌ల్ మీడియాను భావ ప్ర‌కటన స్వేచ్ఛ‌లో భాగంగా చూడాల‌ని కేంద్రానికి సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. కేసులు న‌మోదు చేయ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. అయితే.. మితిమీరిన‌, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల విష‌యంలో మాత్రం మిన‌హాయింపు ఉంటుంది. సునిశిత విమ‌ర్శ‌ల‌కు మాత్రం సోష‌ల్ మీడియాను వాడుకునే అవ‌కాశం ఉంది. అంత‌కుమించి వ్య‌క్తిగత దూష‌ణ‌ల‌కు తావులేద‌ని తాజాగా కేంద్ర హోం శాఖ స్ప‌ష్టం చేసింది.