సమాజాన్ని సరైన దారిలో పెట్టాల్సిన పోలీసులే.. దారి తప్పుతున్నారు. బయట ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నంలో వారి కుటుంబాలు గాడి తప్పుతున్న విషయాన్ని మరిచిపోతున్నారు. ఏపీలోనూ.. తెలంగాణలోనూ.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఏఎస్ఐ కుమారుడికి ఉగ్రవాదులతో లింకులు ఉన్న విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.
ఇది మరుపునకు రాకముందే.. విశాఖ జిల్లాకు చెందిన ఓ సీఐ కుమారుడు గంజాయి రవాణా కేసులో పట్టు బడ్డారన్న వార్తలు వచ్చాయి. అయితే.. దీనిని అధికారులు దాచిపెట్టారన్న విమర్శలు కూడా తెరమీదికి వచ్చాయి. మరోవైపు.. తెలంగాణలో వీటిని మించిన కేసులు వివాదంగా మారాయి. ఏకంగా డ్రగ్స్ కేసుల్లో ఎస్పీ, డీసీపీ కుమారుల పేర్లు తెరమీదికి రావడం గమనార్హం. హైదరాబాద్ శివారు ప్రాంతం కొంపల్లిలో కొన్నాళ్ల కిందట డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. దీనిని ఈగల్ టీం ప్రతిష్టాత్మకంగా విచారిస్తోంది.
సీఎంవో ఈ విచారణను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఎంతటి వారు ఈ కేసులో ఉన్నా.. వదిలి పెట్టరాదని సీఎం సహా అధికారులు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసును తీవ్రంగా భావిస్తున్న అధికారులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల కుమారుల పేర్లు తెరమీదికి వచ్చాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ ఈ కేసులో ఉన్నారని తెలిసింది. దీంతో ఆయన జీవన శైలి, వ్యవహారాలపై అధికారులు కూపీ లాగుతున్నారు.
గత ఏడాది నమోదైన ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు పట్టుబడకుండా రాహుల్ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఆయన తప్పించుకుని తిరిగేందుకు ఎవరు సహకరిస్తున్నారన్న విషయంపైనా అధికారులు కూపీ లాగుతున్నారు. మరోవైపు.. ఇప్పటి వరకు అరెస్టయినవారిలో నిందితుడుగా ఉన్న మోహన్ సైబరాబాద్ డీసీపీ సంజీవరావు కుమారుడిగా గుర్తించారు. దీంతో పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. నేరం రుజువైతే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates