దుబాయ్ ను మనోళ్ళు దున్నేస్తున్నారు

రియల్ ఎస్టేట్ రంగంలో మనోళ్ళు దుబాయ్ ను దున్నేస్తున్నారు. 2019 సంవత్సరంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడుల్లో భారతీయులదే టాప్ పొజీషన్. విచిత్రమేమిటంటే దుబాయ్ లో రియల్ రంగంలో సౌదీ అరేబియా, ఎమిరేట్ వాసులు కూడా మనకన్నా వెనకబడే ఉన్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంటు తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 5246 మంది భారతీయులు దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు. మన వాళ్ళంతా కలిసి పోయిన ఏడాది 10.89 బిలయన్ దిర్హామ్స్ పెట్టుబడిపెట్టారు.

భారతీయుల తర్వాత ఎమిరేట్స్ వాళ్ళు 5172 మంది పెట్టుబడులు పెట్టారు. వీళ్ళ పెట్టుబడులు 8.1 బిలియన్ దిర్హామ్స్, 2198 మంది సౌదీ అరేబియా పెట్టుబడిదారులు 4.92 బిలియన్ దిర్హామ్స్ పెట్టుబడులు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనీయులు 2096 మంది , బ్రిటీష్ వాళ్ళు 2088 మంది, పాకిస్ధాన్ వాళ్ళు కూడా 1913 మంది దుబాయ్ లో పెట్టుబడులు పెట్టారు. 955 మంది ఈజిప్షియన్లు, 855 మంది జోర్డాన్ వాసులు, 682 మంది అమెరికన్లు, 678 మంది కెనడావాసులు కూడా దుబాయ్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళలో ఉన్నారు.

నిజానికి గల్ఫ్ దేశాలకు మన దేశానికి దశాబ్దాల పాటు అవినావభావ సంబంధం ఉంది. మనదేశంలోని అనేక రాష్ట్రాల నుండి గల్ఫ్ దేశాలకు కొన్ని లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాల పేరుతో గల్ఫ్ దేశాల్లో స్ధిరపడిపోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల సంగతి ఎలాగున్నా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణా, ఏపి, కేరళ వాసులే లక్షల్లో ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంతో పాటు హోటళ్ళు, ఆసుపత్రులు, ఫార్మా రంగంలో కూడా మన వాళ్ళు భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

విదేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించేందుకు చివరకు గల్ఫ్ దేశాలు తమ ఆర్ధిక, విదేశాంగ విధానాలను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. తమ రాజ్యాంగాన్నే సవరించుకుని పెట్టుబడులు పెట్టమని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాయంటే గల్ఫ్ దేశాలపై విదేశాలు ప్రత్యేకించి మనదేశం ప్రభావం ఎంతుందో అర్ధమైపోతోంది. దుబాయ్ లోని మెరీనా ప్రాంతంలోనే ఎక్కువ పెట్టుబుడు పెడుతున్నారట. తర్వాత బిజినెస్ బే, ఆల్ ఖైరాన్, షేక్ మహమ్మద్ బిన్ రషీద్ గార్డెన్స్, బుర్జ్ ఖలీఫా ప్రాంతాలున్నాయని దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ మ్యానేజ్మెంట్ విభాగం సీఈవో మజీదా ఆలీ రషీద్ ప్రకటించారు.