భారత క్రికెట్ అభిమానుల ఫేవరెట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన మహమ్మద్ షమి.. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న హసీన్ జహాన్ అనే మోడల్‌ను అతను 2014లో పెళ్లి చేసుకోవడం.. నాలుగేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడం.. షమితో పాటు అతడి కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ షహీన్ గృహ హింస సహా పలు కేసులు పెట్టడం తెలిసిందే. ఈ కేసుల్లో పోరాడుతూనే.. క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు షమి.
ఐతే తాజాగా కోల్‌కతా హైకోర్టు షమికి పెద్ద షాకే ఇచ్చింది. తన భార్య, కూతురికి కలిపి నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని కోర్టు షమిని ఆదేశించింది. ఈ మొత్తం ఏడేళ్ల కిందటి నుంచి లెక్క గట్టి ఇవ్వాలని కోర్టు పేర్కొనడం గమనార్హం.
2018లో అలీపూర్ కోర్టు నిర్ణయించిన ప్రకారం.. షమి తన భార్యకు రూ.50 వేలు, తన ద్వారా కలిగిన సంతానమైన కూతురు ఐరాకు రూ.80 వేలు చొప్పున భరణం చెల్లించాలి. ఆ ప్రకారమే అతను భరణం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే షమి వార్షిక ఆదాయం భారీగా ఉన్న విషయాన్ని కోర్టులో ప్రస్తావించి.. తనకు అధిక భరణం ఇప్పించాలని షహీన్ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన కోర్టు.. షమి ఆదాయాన్ని పరిశీలించి, భరణాన్ని భారీగా పెంచింది. నెలకు షహీన్‌కు రూ.1.5 లక్షలు, ఐరాకు రూ.2.5 లక్షల చొప్పున చెల్లించాలని.. గత ఏడేళ్ల కాలానికి ఈ మేరకు లెక్కగట్టి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏటా ఏడెనిమిది కోట్లకు తక్కువ కాకుండా షమి ఆదాయం ఆర్జిస్తున్న నేపథ్యంలో.. భార్య, కూతురికి అందుకు తగ్గట్లే భరణం ఇవ్వాలని కోర్టు పేర్కొంది.
షమి నుంచి విడిపోయినపుడు షహీన్ అతడి మీద, కుటుంబ సభ్యుల మీద తీవ్ర ఆరోపణలే చేసింది. వాళ్లందరూ తనను తీవ్రంగా హింసించారని.. షమి సోదరుడు తనను రేప్ చేశాడని.. ఇలా ఆమె అనేక ఆరోపణలు చేసింది. ఐతే షమిని షహీన్ డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని.. అతడిని ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని షమి కుటుంబ సభ్యులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates