తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో చాలా కాలం క్రితం కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఉదయం ఉన్నట్లుండి ఓ కెమికల్ రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పరిశ్రమల చుట్టుపక్కన ఏకంగా 6 నుంచి 7 కిలో మీటర్ల దాకా ప్రకంపనలు నమోదయ్యాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు.
ఉదయమే కార్మికులంతా విధుల్లోకి చేరిన కొంతసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీంతో రియాక్టర్ కు సమీపంలో ఉన్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇక గాయపడ్డ వారిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. ఇక మిగిలిన క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పేలుడు ధాటికి రియాక్టర్ సమీపంలోని మూడంతస్తుల భవనం నేలమట్లం అయ్యింది. మరి ఈ భవన శిధిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా?అన్న దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిసరాల్లోని పరిశ్రమల్లో ఇంతటి భారీ ప్రమాదం సంభవించలేదనే చెప్పాలి. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా పరిశ్రమలు నగరానికి మరింత దూరంగా తరలిపోతుండటం…ఆయా ప్రాంతాల్లో కొత్తగా నిర్మితం అవుతున్న యూనిట్లలో పరిశ్రమల యాజమాన్యాలు సేఫ్టీ మెజర్లను పాటిస్తున్న నేపథ్యంలో పెద్దగా ప్రమాదాలే చోటుచేసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ తీవ్ర కలవరపాటుకు గురి చేస్తూ సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ప్రస్తుతం పరిశ్రమలో మంటలు అదుపులోకి వచ్చినా… ఇంకా సహాయక చర్యలు పూర్తి కాలేదు. కార్మికుల్లో మరో 10 మంది కనిపించడం లేదని పరిశ్రమ యాజమాన్యం చెబుతోంది.
ఇదిలా ఉంటే…ఈ ప్రమాదంపై తెలంగాణ సర్కారు వేగంగా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అధికారులకు ఫోన్ చేసి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. మృతుల గురించి ఆరా తీసిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం గురించి తెలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ నేరుగా ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates