భార్యకు జాబ్ ఉన్నా భరణం ఇవ్వాలి: హైకోర్టు

బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూసిన భర్తకు దిమ్మ తిరిగే షాకిచ్చింది బాంబే హైకోర్టు. విడాకులు తీసుకున్న తర్వాత.. మాజీ భార్యకు ఆర్థికంగా సపోర్టు చేయాల్సిన మాజీ భర్త.. ఆమెకున్న చిన్న ఉద్యోగాల్ని సాకుగా చూపిస్తూ.. భరణం చెల్లించాల్సిన అవసరం లేదంటూ కోర్టును ఆశ్రయించిన ఉదంతంలో ఎదురుదెబ్బ తగిలింది.అసలేం జరిగిందంటే..

భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. భార్య గౌరవప్రదమైన జీవనం కోసం ఆమెకు నెలకు రూ.15 వేలు చొప్పున భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భర్త ఆ ఆదేశాల్ని సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా భార్య జాబ్ చేస్తుందని.. ఆర్థికంగా ఆమెకు తాను అండగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. భార్యకు నెలకు రూ.25 వేలు జీతంగా వస్తోందని.. అదే సమయంలో భర్తకు నెలకు రూ.లక్షకు పైగా జీతం వస్తుందన్న విషయాన్ని పేర్కొంటూ.. ఉద్యోగం ఉన్నంత మాత్రాన భరణం ఇవ్వాల్సిన అవసరం లేదన్న భర్త వాదనను తప్పుపట్టింది. భర్తకు పెద్ద జీతంతో పాటు ఆర్థికంగా ఇతరత్రా బాధ్యతలు లేవన్న విషయాన్ని గుర్తించిన హైకోర్టు.. భార్య వాదనను సమర్థిస్తూ.. ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.