ఫోన్ ట్యాపింగ్.. షర్మిళకు సుబ్బారెడ్డి జవాబు

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎంతోమంది ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో సోషల్ మీడియాలో కనిపిస్తున్న జాబితా చూసి అందరూ షాకవుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిళ సైతం తన ఫోన్ ట్యాప్ అయినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్, వైసీపీ ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ కూడా అని ఆమె అన్నారు. తన ఫోన్ ట్యాప్ అయిందనడానికి పక్కా ఆధారాలున్నాయని.. వైసీపీ అగ్ర నేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ట్యాప్ అయిన కాల్‌కు సంబంధించి తన వాయిస్‌ను స్వయంగా వినిపించినట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కాగా.. సుబ్బారెడ్డి వెంటనే దీనిపై స్పందించారు. షర్మిళ ఆరోపణలు అబద్ధమని ఆయన ఖండించారు.

“గత తెలంగాణ ప్రభుత్వం షర్మిలగారి ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా, షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారు. అప్పుడు జగన్‌గారికి, షర్మిలగారికి సంబంధాలు ఇలా లేవు. అలాంటి పరిస్థితుల్లో షర్మిలగారి ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్‌గారి ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్‌గారి ప్రభుత్వం ట్యాప్‌చేసిందా? లేదా? అన్నది నాకు తెలియదు. టీడీపీకి సంబంధించిన ఎల్లో టీవీల్లో, పత్రికల్లో నాపేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నాను” అని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు సుబ్బారెడ్డి.

ఐతే నిన్న ఈ ఆరోపణలు చేసేటపుడే సుబ్బారెడ్డి గురించి షర్మిళ మరో వ్యాఖ్య చేశారు. ఆస్తి పంపకాల వివాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన సుబ్బారెడ్డి.. జగన్ కోసం తర్వాత మాట మార్చిన విషయాన్ని ప్రస్తావించి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన దానిపై ఇప్పుడొచ్చి నిజాలు మాట్లాడతారని అనుకోవడం లేదని అన్నారు. ఆమె అన్నట్లే సుబ్బారెడ్డి షర్మిళ వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టు పెట్టేశారు.