రూ.కోటికి అదనంగా మరో రూ. 25 లక్షల పరిహారం

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఇవ్వనున్న పరిహారం మరింగా పెరిగింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా సన్స్ తరఫున ఒక్కో మృతుడికి రూ.1 కోటి పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రమాదం జరిగిన రోజే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటన చేశారు. తాజాగా ఎయిర్ ఇండియా శనివారం మరో ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు మరో రూ.25 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఎయిర్ ఇండియా ప్రకటించిన రూ.25 లక్షల పరిహారం… టాటా సన్స్ ప్రకటించిన రూ.1 కోటి పరిహారానికి అదనమని కూడా ఆ సంస్థ విస్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా తాను ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాను అత్యవసరమైన సాయంగా పరిగణించి తక్షణమే బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించడం గమనార్హం. ఈ లెక్కన మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా, టాటా సన్స్… రెండు సంస్థల నుంచి ఏకంగా చనిపోయిన ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల పరిహారం అందనుంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రస్తుతానికి చనిపోయిన వారి సంఖ్య 270ని దాటేసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీ మెడికోలు 50 మంది దాకా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారాం. అంతేకాకుండా ఒకరిద్దరు మెడికోల ఆచూకీ లభించడం లేదన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదనే చెప్పక తప్పదు.

ఇక విమాన ప్రమాదం జరిగిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకే దాదాపుగా రెండు రోజుల సమయం పట్టింది. విమానంలో బారీ ఎత్తున ఎయిర్ ఫ్యూయల్ ఉండటంతో అదంతా మండిపోయేదాకా మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా శుక్రవారం రాత్రికి మంటలు అదుపులోకి రాగా… శనివారం ఉదయం నుంచి విమాన శకలాల తొలగింపు ప్రారంభం అయ్యింది. ఈ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అన్న దిశగానూ రెస్క్యూ బృందాలు పరిశీలన చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి అయితే తప్పించి మృతుల సంఖ్యపై ఓ అంచనాకు రాలేమని చెప్పాలి.