గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ మృత్యువాత పడ్డట్టు పోలీస్ కమిషనర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మరికాసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బట్ట కట్టాడని, అతడు ప్రమాద మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని ఆయన తెలిపారు. వెరసి ఆ వ్యక్తిని ఆయన మృత్యుంజయుడిగా అభివర్ణించారు.
గురువారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ప్రయాణికులను ఎక్కించుకుని వెంటనే టేకాఫ్ తీసుకుంది. అయితే నిమిషాల వ్యవధిలో ఆ విమానం ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలింది. ఈ ప్రమాదంలో బతికి బట్ట కట్టిన వ్యక్తి కూడా అహ్మదాబాాద్ లోనే విమానం ఎక్కాడు. అయితే ప్రమాద సమయంలో ఏం అద్భుతం జరిగిందో తెలియదు గానీ… పెద్దగా గాయాలేమీ లేకుండా…ముఖానికి, చేతులకు చిన్న చిన్న గాట్లతో అతడు ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇక ఈ మృత్యుంజయుడి వివరాల్లోకి వెళితే…అహ్మదాబాద్ పరిసరాల్లోని ఓ గ్రామమో, చిన్న పట్టణానికో చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్ అతడి పేరు. 20 ఏళ్లుగా ఆయన లండన్ లోనే ఉంటున్నారట. ఇటీవలే తన కుటుంబ సభ్యులను చూసేందుకు ఆయన అహ్మదాబాద్ వచ్చారు. కొంతకాలం కుటుంబంతో గడిపిన ఆయన సోదరుడితో కలిసి గురువారం లండన్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రమాదంలో రమేశ్ బతికి బట్ట కట్టగా…ఆయన సోదరుడు మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదని రమేశ్ చెబుతున్నాడు.
విమానంలో రమేశ్ కు విమానం మధ్య భాగంలో 11ఏ సీటు కేటాయించారు. ఇది విండో సీటు. ప్రమాదం సమయంలో విమానం జనావాసాలపై పడగానే… రమేశ్ తన సీటుతో సహా లేచిపోయి అల్లంత దూరాన పడి ఉంటారన్న విశ్లేషణలు అయితే సాగుతున్నాయి. అంతకుమించి మరే మార్గం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. విమానం నేలకూలగానే భారీ కుదుపులకు విమానం సీటు బోల్టులతో సహా విమానం నుంచి విడిపోయి… అద్దాన్ని పగులగొట్టుకుని మరీ బయటకు వచ్చి ఉంటుందని వారు చెబుతున్నారు. ఏదైతేనేం ఇంతటి ఘోర ప్రమాదంలోనూ రమేశ్ స్వల్ప గాయాలతో బయటపడటం నిజంగానే అద్భుతమనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates