గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో యావత్తు ప్రపంచ దేశాలను హడలెత్తించింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం ప్రయాణికులు, సిబ్బంది కలిసి 242 మంది మృత్యువాత పడ్డారన్న వార్తలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అధికారికంగా ధృవీకరించారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్ లోని తన భార్యను తీసుకొచ్చేందుకు బయలుదేరిన ఆయన అహ్మదాబాద్ దాటక ముందే అగ్ని కీలలకు ఆహుతి అయిపోయిన వైనం అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం మొత్తం 230 మంది ప్రయాణికులతో లండన్ వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుంచి గురువారం ఉదయం బయలుదేరిన ఈ విమానం అహ్మదాబాద్ లో విజయ్ రూపానీ సహా మరికొందరినీ ఎక్కించుకుని బయలుదేరింది. విమానంలో పైలట్లు, సహాయక సిబ్బంది మొత్తం 12 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉండగా… 53 మంది బ్రిటిషర్లు, 7 మంది పోర్చుగీస్ వారు, ఓ కెనడియన్ ఉన్నారు. ఇక ప్రయాణికుల్లో ఇద్దరు పసిపిల్లలతో పాటు 12 మంది చిన్నారులు ఉన్నారు.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే విమానాశ్రయానికి సమీపంలోని జనావాసాలపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం స్థాయిని గుర్తించిన అధికారులు…విమానంలోని ఏ ఒక్కరు కూడా బ్రతికి బయటపడే అవకాశాలే లేవని ఊహించారు. ఎందుకంటే… విమానంలోని భారీ స్థాయిలోని ఫ్యూయల్ విమానాన్ని, అది కూలిన పరిసరాలను దహించివేసింది. ఫలితంగా విమానంలోని ఒక్కరంటే ఒక్కరు కూడా బయటపడలేకపోయారు. ఇక విమాన ప్రమాదం కారణంగా బయట ఉన్న వారు ఎంతమంది చనిపోయారన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.
విమానంలో భారత్ కాకుండా మూడు దేశాలకు చెందిన పౌరులు ఉండటంతో ఆయా దేశాల నుంచే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున స్థానిక అధికారులపై ఒత్తిడి వచ్చింది. అసలు ప్రమాదంలో చనిపోయిన వారు ఎందరు? ఎంతమంది బయటపడ్డారు? అంటూ ఆయా దేశాల నుంచి పదే పదే ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధికి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మృతుల సంఖ్య గురించి వివరిస్తూ… ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు కూడా బ్రతకలేదని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే… ఈ ప్రమాదంలో బయట పరిసరాల్లోని చనిపోయినవారి సంఖ్య కూడా కలుపుకుంటే… మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates