గుజరాత్ విమాన ప్రమాదంలో 100 మంది మృతి?

గుజరాత్ లో విమానం కుప్పకూలిన దుర్ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. జనావాసాల మధ్య విమానం కూలడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉండడం కలచివేస్తోంది. ముఖ్యంగా బీజే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు మరణించారని తెలుస్తోంది. మధ్యాహ్న భోజన సమయం కావడంతో చాలామంది పీజీ వైద్య విద్యార్థులు హాస్టల్ లోని డైనింగ్ హాల్ లో ఉన్నారని తెలుస్తోంది.

ఈ ప్రమాద ఘటనలో కనీసం 20 మంది మెడికోలు మృతి చెందారని తెలుస్తోంది. ఓ బిల్డింగ్ లో 30 కాలిపోయిన మృతదేహాలు గుర్తించామని సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది వెల్లడించినట్లు ‘రాయిటర్స్’ తెలిపింది. మొత్తంగా ఈ ప్రమాదంలో దాదాపు 100 మందికి పైగా మృతి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ పై, జనావాసాల మధ్య కుప్పకూలడం, వెంటనే మంటలు చెలరేగడం వంటి కారణాల నేపథ్యంలో మరణాల సంఖ్య భారీగా ఉండే చాన్స్ ఉంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్ఘటన మాటలకందని విషాదం అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నానని మోదీ అన్నారు.

ఈ ప్రమాద ఘటన అనంతరం జరుగుతున్న సహాయక చర్యలు ఎంతో కీలకమైనవని, సకాలంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణ నష్టం తగ్గించవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.