వివాహం కొత్తగా జరిగింది. హనీమూన్ కోసం భార్యాభర్తలు మేఘాలయకు వెళ్లారు. కానీ, అక్కడ క్షణాల్లో కబుర్లు మారిపోయాయి. ఈమె కేవలం భార్య కాదు… హంతకురాలిగా మారింది. భర్త హత్య కేసులో అసలు కుట్రదారే భార్యగా తేలిపోవడంతో, ఈ ఉదంతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ అనే జంట ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన వీరిలో… మే 23న రాజా మృతదేహం లభించగా, భార్య సోనమ్ అదృశ్యమైంది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదై దర్యాప్తు మొదలైంది. అయితే, సోనమ్ పోలీసుల ఎదుట లొంగి ఇచ్చిన వివరాలు వారిని షాక్‌కు గురిచేశాయి.
తనకు మరో వ్యక్తితో సంబంధం ఉందని, భర్త అడ్డుగా మారాడన్న కారణంతోనే కిరాయి హంతకులతో రాజాను హత్య చేయించినట్టు ఆమె ఒప్పుకుంది. ఈ ఘాతుకానికి ముమ్మాటికీ ఆమెనే మాస్టర్ మైండ్ అని పోలీసులు తేల్చారు. సోనమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో అరెస్ట్ చేయగా, హత్యలో పాల్గొన్న ముగ్గురు కిరాయి గుండాలను ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఈ హత్య ఎలా జరిగిందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. రాజా హత్యకు ఉపయోగించిన ఆయుధం, హంతకులకు ఇవ్వబడిన డబ్బు, ఇతర మద్దతుదారుల వివరాలపై అధికారులు క్లారిటీ తీసుకునే పనిలో ఉన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హనీమూన్‌ని అవకాశంగా మార్చుకుని జీవిత భాగస్వామిని దారుణంగా హత్య చేయించిన సోనమ్ వ్యవహారం నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రేమ పేరుతో, సంబంధాల పేరుతో జరుగుతున్న ఈ స్థాయి దారుణాలు ఈమధ్య మరింత ఎక్కువవుతున్నాయి.