కాటేరమ్మ కొడుకు.. బూమ్ లో ఉండగా ఎండ్ కార్డ్!

సాధారణంగా క్రికెట్ ప్లేయర్స్ 36 తరువాత రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ సౌత్ ఆఫ్రికా పవర్ఫుల్ ప్లేయర్ ఊహించని విదంగా 33 లోనే ఇంటర్నేషనల్ ఆటకు గుడ్ బై చెప్పడం షాకింగ్. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన  హైన్రిచ్ క్లాసెన్ హడావుడి లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని స్వయంగా క్లాసెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది.

వైట్ బాల్ క్రికెట్‌లో క్లాసెన్ అనతికాలంలోనే తనదైన ముద్ర వేసాడు. దక్షిణాఫ్రికా జట్టుకు 60 వన్డేలు, 58 టి20లు ఆడి అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌లో కూడా సన్ రైజర్స్ తరఫున తన మిడిల్ ఆర్డర్ హిట్టింగ్‌తో మ్యాచుల ఫలితాన్ని తారుమారు చేసిన సందర్భాలు అనేకం. అంతటి ఆటగాడు ‘ఇప్పుడు నా కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా. ఇది చాలా కష్టం అయినా, నా మనసుకు శాంతి కలిగించిన నిర్ణయం’ అని పేర్కొన్నాడు.

సన్ రైజర్స్ అభిమానులు సోషల్ మీడియాలో క్లాసెన్‌ను ‘కాటేరమ్మ ముద్దుల కొడుకు’గా సంబోధిస్తూ ఉంటారు. ప్రతీ ఐపీఎల్ సీజన్ వీడియోలు షేర్ చేయడం ట్రెండింగ్‌ అవుతోంది. ఇక మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఈ విధంగా రిటైర్మెంట్ ప్రకటన రావడం ఫ్యాన్స్‌ను కలిచివేసింది. అయితే క్లాసెన్ తాను ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతానని, ముఖ్యంగా ఐపీఎల్‌లో మళ్లీ కనిపిస్తానని సూచన ఇవ్వడం కొంత ఊరటనిచ్చింది.

తొలుత టెస్టులకు గుడ్‌బై చెప్పిన క్లాసెన్, ఇప్పుడు పూర్తిగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతని కెరీర్‌లో ఉన్న గొప్ప ఆటగాళ్లతో ఏర్పడ్డ సంబంధాలు, కష్టకాలంలో మద్దతుగా నిలిచిన కోచ్‌లు, జట్టుతో గడిపిన క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానన్న క్లాసెన్ ఎమోషనల్‌గా తన పోస్ట్‌ను ముగించాడు. ఇకపై అతనిని ఫుల్ టైమ్ ఐపీఎల్ స్టార్‌గా మాత్రమే చూడాల్సి ఉంటుందేమో.