కర్ణాటకలో తాజాగా చోటుచేసుకున్న ఒక దుర్మార్గపు సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు యువకులు బెయిల్‌పై విడుదలైన వెంటనే వీరుల్లా ఊరేగింపులో పాల్గొనడం కలకలం రేపుతోంది. హవేరి సబ్ జైలు నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు, సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కి ఆళూరు పట్టణం వరకు కొనసాగింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలలో, ఏడుగురు నిందితులు ఐదు కార్లతో కూడిన కాన్వాయ్‌లో ఊరేగింపుగా తిరుగుతూ, అభిమానుల మద్దతుతో నడుస్తూ కనిపించారు. వీరిని స్థానికులే కాకుండా కొందరు నాయకులు కూడా స్వాగతించినట్లు తెలుస్తోంది. ఇది న్యాయవ్యవస్థను అవమానించడమే కాకుండా బాధితురాలికి తీవ్ర అవమానం కలిగించిందని మహిళా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసు జనవరి 2024లో చోటుచేసుకుంది. హవేరి జిల్లాలో ఓ యువతిని మోసం చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఘటన లాడ్జి సమీపంలో వదిలేసినట్లు బాధితురాలు ఆరోపించింది. పోలీసుల దర్యాప్తులో నిందితులపై పలు చార్జీలు నమోదు కాగా, వారిలో కొందరు గతంలోనూ మానసిక వేధింపులు, మోరల్ పోలీసింగ్ కేసుల్లో ఉన్నట్లు సమాచారం.
తాజాగా బాధితురాలు కోర్టులో నిందితులను సరిగా గుర్తించలేకపోవడం వల్ల న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ఇక అదునుగా ఆనందంగా మార్చుకుని, దురాశయంతో ఊరేగింపుగా ప్రదర్శించుకోవడం న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ ఊరేగింపు వీడియోలపై పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసే అవకాశముంది.