ఇప్పటివరకు శాంతియుత ప్రయోగాలతో ఆకట్టుకున్న ఇస్రో, ఇప్పుడు భద్రతా వ్యూహాల విషయంలోనూ కీలకంగా మారుతోంది. దేశ సరిహద్దులు, సముద్ర తీరాలు, వ్యూహాత్మక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించేలా పది అత్యంత ఆధునిక నిఘా ఉపగ్రహాలను ప్రయోగించి ఇప్పటికే పనిచేసేలా చేసినట్లు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ వెల్లడించడమొక కీలక మలుపుగా మారింది. ఈ ఉపగ్రహాల ద్వారా శత్రు దేశాల కదలికలను ముందుగానే గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టేందుకు వీలవుతుంది. ముఖ్యంగా చైనా తరచూ ప్రయత్నించే చొరబాట్లను ఇప్పుడు ఉపగ్రహం చూసే దృష్టిలో దాచలేని పరిస్థితి ఏర్పడనుంది.
ఈ ఉపగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే… ఎలాంటి వాతావరణం, ఎలాంటి ప్రాంతమైనా.. అటవీ ప్రాంతాలు, మంచుతో కప్పిన ప్రదేశాలు అయినా సరే.. అధిక రిజల్యూషన్‌లో స్పష్టమైన చిత్రాలను పంపగలగడం. వీటి ద్వారా భూభాగ మార్పులు, శిబిరాల ఏర్పాటు, ఆయుధ కదలికలు వంటి శత్రు చర్యలపై ముందస్తు సమాచారాన్ని సేకరించవచ్చు. ఇది కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు. సహజ విపత్తుల సమయంలో నష్టాన్ని నివారించేందుకు కూడా ఉపయోగపడుతుంది. వరదలు, భూకంపాలు వంటి విపత్తులపై వేగంగా స్పందించే ప్రభుత్వానికి ఇది విలువైన సమాచార వనరు.
ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగాల వల్ల పౌర అవసరాలకూ పెద్ద దోహదం జరుగుతోంది. వ్యవసాయం, అటవీ పరిరక్షణ, భూకవాతల సమాచారం, వాతావరణ భవిష్యవాణి వంటి అంశాల్లో ఈ ఉపగ్రహాల సమాచారం కీలకంగా మారింది. వ్యవసాయ ఉత్పత్తిలో నష్టాలు తక్కువయ్యేలా చేసే డేటా ఇవి అందిస్తుండగా, టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో ప్రాధాన్యత కలిగిన సేవలకు కూడా వీటి ఉపయోగం అమూల్యంగా మారింది.
ఇప్పటికే 433 అంతర్జాతీయ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన భారత్, ఇప్పుడు అమెరికాతో కలిసి అత్యధునిక భూమి పరిశీలన ఉపగ్రహాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది పూర్తైతే, ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ నిఘా సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ ముందున్నట్టే. ఈ పరిణామాల మధ్య చైనా మరింత జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇదే. ఎందుకంటే భారత్ ఇప్పుడు భద్రతా దృక్పథంలో స్పష్టమైన ఆధిక్యత సాధిస్తోంది. కాబట్టి చొరబడిన సమయంలో తోక కత్తెరించేలా నిఘా వ్యవస్థతో అలెర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా వారి కవ్వింపులను హైలెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చైనా కూడా ఈ పరిణామాల పట్ల వెనుకడుగు వేసే అవకాశం ఎక్కువే.
Gulte Telugu Telugu Political and Movie News Updates