కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు తీరు మారదా? అని నిలదీసింది. అంతేకాదు.. కనీసం ఫిర్యాదును పరిశీలించే సమయం లేకుండా పోయిందా? అని అసహనం వ్యక్తం చేసింది. ఇలా అయితే.. ఈడీపై తగు చర్యలు తప్పవని.. తామే లక్ష్మణ రేఖలు నిర్దేశించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈడీ వ్యవస్థకు ఉన్న గౌరవ మర్యాదలను కాపాడుకోవాలని సూచించింది.
ఏం జరిగింది?
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. ఇటీవల ఓ శునకాన్ని కొనుగోలు చేశానని పోస్టు చేశారు. దీని ఖరీదు 10 కోట్ల రూపాయలని కూడా పేర్కొన్నారు. ఈ పోస్టు జోరుగా వైరల్ అయింది. ఇప్పటి వరకు కోటి, రెండు కోట్ల రూపాయల వరకు జంతువులు ధర పలకడం తెలిసిందే. పైగా కుక్కల విషయంలో అయితే.. అసలు ఇంత ధర లేదు. దీంతో సదరు వ్యక్తి పెట్టిన పోస్టుకు జోరుగా ప్రచారం లభించింది. ఈ విషయం తెలిసిన ఈడీ వెంటనే రంగంలోకి దిగింది.
సదరు వ్యక్తిని పట్టుకుని విచారించింది. ఈ క్రమంలో అతని వద్ద రూ.40 కోట్ల వరకు లెక్కలు చూపని సొమ్ము ఉందని గుర్తించారు. ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీశారు. కానీ.. ఇంతలో నే అతనిపై కేసు పెట్టారు. దీంతో సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించి.. ఈడీ తనను వేధిస్తోందని ఆరోపించారు. తనపై ఈడీ పెట్టిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈడీని వివరణ కోరింది.
“రూ.40 కోట్లు ఉన్నాయని కేసు పెట్టారు. కానీ, పిటిషనర్‌కు ఏ సంస్థలతో సంబంధాలు ఉన్నాయో.. మీరు చూపించలేక పోయారు. సహజంగా ఆస్థుల పరంగా సొమ్ములు ఉండడం తప్పుకాదు. పిటిషనర్ ఆదాయ పన్ను కడుతున్నప్పుడు.. అతనికి వేరే సంస్థలతో ఎలాంటి సంబంధం లేనప్పుడు.. మీరెందుకు జోక్యం చేసుకున్నారు. ఇదేం కేసు. ఇదేం పని” అని అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తామే లక్ష్మణ రేఖలు గీయాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా.. వాస్తవానికి ఈడీ అనేది స్వతంత్ర వ్యవస్థ. కానీ, కొన్నాళ్లుగా రాజకీయ ప్రాబల్యం పెరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates