ట్రంప్ షాక్.. ఎన్నికల ఫలితాలపై సుప్రీంకు వెళుతున్నా


అనుకున్నదే జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలుచేశారు. అమెరికా ఎన్నికల్లో భారీ మోసం జరగనుందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఒక ట్వీట్ చేసిన ఆయన.. కాసేపట్లో కీలక అంశాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పిన ఆయన.. కాసేపటికి సంచలన వ్యాఖ్య చేశారు.

అమెరికా ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకుంటున్న వేళ.. ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్య చేయటం గమనార్హం. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. నేను సుప్రీంకోర్టుకు వెళ్తున్నా. ఎన్నికల కౌంటింగ్ ను వెంటనే ఆపేయాలని. ఈ ఎన్నికల్లో మేమే గెలవబోతున్నామన్నారు. ‘‘నాకు సంబంధించినంత వరకు ఇప్పటికే మేం గెలిచాం. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతూ.. తుది ఫలితం ఉత్కంటగా మారిన వేళలో.. వైట్ హౌస్ లో మాట్లాడిన ట్రంప్.. తామే గెలుస్తున్నామని.. సంబరాలకు అభిమానులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ‘‘ఇంకా కొన్ని రాష్ట్రాల్లో లెక్కింపు జరుగుతోంది. పెన్సిల్వేనియా.. నార్త్ కరోలైనా.. మిషిగన్.. జార్జియాల్లో విజయం తథ్యం. ఎన్నికల్లో మోసం జరుగుతోంది.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం’’ అని పేర్కొన్నారు.

భారీ విజయోత్సవానికి సిద్ధంగా ఉండాలన్నారు. ‘‘కోట్లాది మంది అమెరికన్లకు ధన్యవాదాలు. ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నాం. కానీ.. భారీ విజయం దక్కింది. కోట్లాది మంది ఉన్న టెక్సాస్ లోనూ గెలిచాం. పెన్సిల్వేనియాలో విజయం సాధిస్తున్నాం. మిషిగాన్ లో గెలుస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఉదయం నాలుగు గంటలకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని.. తాము సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. మరి.. ట్రంప్ మాటకు తగ్గట్లే.. ఓట్ల లెక్కింపును నిలిపివేస్తారా? కొనసాగిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.