వైభవ్‌కు గవాస్కర్ వార్నింగ్ గుర్తుండాల్సిందే!

ఐపీఎల్ లో మొదటి నుంచి ఫోకస్ అవుతున్న రాజస్థాన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ముంబైతో జరిగిన మ్యాచ్ ఊహించని షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు కేవలం రెండో బంతికే డకౌట్ కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. పైగా మ్యాచ్‌కి ముందు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన అంచనాలే నిజమవ్వడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఐపీఎల్ ను చాలా అద్భుతంగా ఆరంభించిన వైభవ్, గుజరాత్‌పై సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ ముంబై బౌలర్లు ముందుగానే పథకం వేసి బౌన్స్ బంతులతో అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు. దీపక్ చాహర్ వేసిన రెండో బంతికి చెత్త షాట్ ఆడి మిడాన్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. యువ ఆటగాడి పై బౌలర్లు ప్రత్యేక వ్యూహాలతో వస్తారని గవాస్కర్ ఇదివరకే హెచ్చరించిన మాటలు హైలెట్ అవుతున్నాయి.

సునీల్ గవాస్కర్ ఇటీవల రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.  గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత శతకం సాధించిన తర్వాత, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ రెండో బంతికే డకౌట్ అయ్యాడు.  ఈ నేపథ్యంలో గవాస్కర్ చేసిన సూచనలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

గవాస్కర్ మాట్లాడుతూ, “వైభవ్ 13 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా యూత్ టెస్ట్‌లో శతకం సాధించాడు. అతడిలో ప్రతిభ ఉంది, కానీ ఇంకా పూర్తిగా రాటుదేలలేదు. రాహుల్ ద్రవిడ్ వంటి మెంటర్ల మార్గదర్శకత్వంలో అతడు తన ఆటను మెరుగుపరచాలి” అని పేర్కొన్నారు.

అలాగే, “తొలి మ్యాచ్‌లో మొదటి బంతికే సిక్స్ కొట్టడం, మూడో మ్యాచ్‌లో శతకం సాధించడం చూసి అతడిని అధికంగా పొగడకూడదు. ఇది అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. అనుభవజ్ఞులైన బౌలర్లు అతడిని తేలికగా అంచనా వేయరు. అతడు ప్రతి మ్యాచ్‌లో మొదటి బంతికే సిక్స్ కొట్టాలని భావిస్తే, అది అతడికి ఇబ్బందిగా మారుతుంది” అని గవాస్కర్ హెచ్చరించారు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు, వైభవ్ ముంబైతో మ్యాచ్‌లో రెండో బంతికే డకౌట్ అయిన తర్వాత మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఈ సంఘటనపై సోషల్ మీడియాలో అభిమానులు గవాస్కర్ సూచనలు ఎంత నిజమయ్యాయో చర్చిస్తున్నారు.