బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎదురైన నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో టీమ్ ఇండియాలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో 1-3తో ఘోర పరాజయం పాలైన తర్వాత, కోచింగ్ సిబ్బంది పనితీరుపై బీసీసీఐ లోపలే అసంతృప్తి వ్యక్తమవుతోందట. ముఖ్యంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తినట్టు తెలుస్తోంది. దీంతో గంభీర్ శైలిలో మార్పులు మొదలయ్యాయనే సంకేతాలు బయటకు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం అభిషేక్ నాయర్ సేవలను కొనసాగించబోమని బోర్డు నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అతనితో పాటు ఫీల్డింగ్ కోచ్ తిలక్ దిలీప్, ఫిట్‌నెస్ ట్రైనర్ సోహమ్ దేశాయ్ కూడా తమ పదవులను వీడినట్టు సమాచారం. గత ఎనిమిది నెలలుగా గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన తీసుకున్న కొన్ని ఎంపికలపై తాజాగా పునఃపరిశీలన జరుగుతోంది. అభిషేక్‌ను తొలగించాలన్న ఆలోచన కూడా ఇదే క్రమంలో వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం కొత్త కోచింగ్ సిబ్బంది ఎంపికపై పరిశీలన జరుగుతోంది. ర్యాన్ టెన్ డెస్కాట్‌కు అసిస్టెంట్ కోచ్ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తుండగా, ట్రైనర్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రౌక్స్ పేరును పరిశీలిస్తున్నారు. అతను ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున పని చేస్తున్నాడు. త్వరలో ఆయనను బోర్డు సంప్రదించనుందని తెలుస్తోంది. ఈ మార్పులతో జూన్‌లో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా కొత్త కోచ్ టీంతో సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇంతకాలంగా బోర్డులో కనిపించిన నిశ్శబ్దం ఇప్పుడు మార్పులకు దారి తీస్తోంది. ముఖ్యంగా గంభీర్ శైలి అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే ఫలితాలపై దృష్టి పెట్టేలా మారిందని చెబుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌కు ముందు ఈ మార్పులు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయా? అనే ప్రశ్నకీ త్వరలో సమాధానం లభించనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates