‘గూగుల్’లో లేఆఫ్ లు!.. ఏఐ ప్రభావమేనా?

టెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరుగాంచిన గూగుల్… వరుసబెట్టి ఉద్యోగులను ఇంటికి పంపేస్తోంది. 2023 నుంచి గూగుల్ లో మొదలైన ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నాలుగు నెలల క్రితం గతేడాది డిసెంబర్ లో ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన గూగుల్… తాజాగా మరికొంత మందికి పింక్ స్లిప్ లు ఇచ్చింది. తాజాగా గూగుల్ ఉద్వాసన పలికిన వారిలో చిన్న స్థాయి ఉద్యోగులతో పాటుగా డైరెక్టర్లు, మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. నానాటికి టెక్నాలజీ విస్తరిస్తూ ఉంటే… గూగుల్ ఇలా వందలు, వేల మందికి వరుసగా ఉద్వాసన పలకడానికి కారణం ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

వాస్తవానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తే.. ఉద్యోగాల్లో భారీ కోత ఉంటుందని ఆదిలోనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే చాలా సంస్థలు అందివచ్చిన ఏఐని సద్వినియోగం చేసుకుంటూనే… కొత్త రంగాలకు ఆ టెక్నాలజని అనువర్తిస్తూ… కొత్త రంగాల్లో తాము కాలు మోపుతూ సాగుతున్నాయి. అయితే గూగుల్ కూడా అదే స్థాయిలో వివిధ కొత్త రంగాల్లో కాలు మోపుతున్నప్పటికీ ఉద్యోగుల తొలగింపును మాత్రం కొనసాగిస్తుండటం గమనార్హం. తాజాగా ఉద్యోగాలకు కోత పడిన విభాగాల్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాలు ఉన్నాయి. ఎంత మంది ఉద్యోగులకు గూగుల్ ఉద్వాసన పలికిందన్న విషయం బయటకు రాకున్నా… కొలువులు కోల్పోయిన గూగుల్ ఉద్యోగుల సంఖ్య భారీగానే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఉద్యోగులకు పింక్ స్లిప్ లను గతంలోనూ పలుమార్లు జారీ చేసిన గూగుల్.. 2023 జనవరి నుంచి ఈ ప్రక్రియను నిర్విఘ్నంగా కొనసాగిస్తోందని చెప్పాలి. 2023 జనవరిలో ఒకే సారి 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్.. గతేడాది డిసెంబర్ లో తన మొత్తం ఉద్యోగుల సంఖ్యలో నుంచి ఏకంగా 10 శాతం మేర ఉద్యోగాలకు కోత పెట్టేసింది. ఈ పరిణామం టెక్నాలజీ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిందని చెప్పాలి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే… మొన్న ఫిబ్రవరిలో క్లౌడ్ ఆపరేషన్స్, హెచ్ఆర్ విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులకు శ్రీముఖాలు జారీ చేసింది. తాజా కొలువుల కోతకు ఏఐ వినియోగం పెరగడం, అమెరికాలో మాంద్యం భయాలు, తగ్గిన లాభాలు, వ్యయం తగ్గింపులే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.