ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ కారు తయారీ సంస్థ కియా మోటార్స్‌లో సంచలనాత్మక దొంగతనం వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న కియా ఫ్యాక్టరీలో దాదాపు 900 కారు ఇంజిన్లు మాయం కావడంతో పెద్ద కలకలం రేగింది. కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కియా కార్ల తయారీలో ఉపయోగించే ఈ ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తుంటాయి. అయితే ఈసారి వచ్చిన లోడ్‌లో చాలా ఇంజిన్లు కనిపించకపోవడంతో ఆందోళన మొదలైంది. ఈ ఇంజిన్లు రవాణా సమయంలో మార్గమధ్యంలో ఎక్కడో చోరీకి గురయ్యాయా? లేక కంపెనీకి వచ్చిన తర్వాతే పక్కదారి పట్టాయా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
గత నెల 19న కియా కంపెనీ ప్రతినిధులు పోలీసులను సంప్రదించారు. అయితే, లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేయాలని కోరగా, అలా చేయలేమని పోలీసులు స్పష్టంచేశారు. దీంతో కంపెనీ అధికార ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ దొంగతనంపై ఇప్పటికే పోలీసులు ఆ లోడ్లు తరలించిన లారీలు, డ్రైవర్లు, గోదాములు తదితర అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అంతేకాకుండా, ఫ్యాక్టరీలో ఉన్న సీసీ కెమెరాలు, లాజిస్టిక్స్ డేటాను కూడా పరిశీలించినట్లు తెలిసింది. బహుశా కొంతమంది కంపెనీ లోపలి వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తొందరలోనే పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈ భారీ చోరీపై వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఏం జరిగిందో, ఈ ఇంజిన్లు ఎలా మాయం అయ్యాయో స్పష్టత రానుంది. ఈ మిస్టరీ దొంగతనం ఎట్టకేలకు ఎవరిని తాకుతుందో చూడాలి.