సన్ రైజర్స్.. ఎవరయ్యా ఈ సిమర్‌జీత్‌ సింగ్‌?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోర్లా పడుతోందనే విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేస్‌లో బలహీనంగా మారిన ఆరెంజ్ ఆర్మీ, నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హోం మ్యాచ్‌లో మరోసారి తడిసిముద్దైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమికి ప్రధాన కారణం ఒక్క బౌలర్‌గా హైలైట్ అయ్యాడు.. అతనే సిమర్‌జీత్‌ సింగ్‌. మొదటి ఐదు ఓవర్లలో పట్టు సాధించిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఒక్క ఓవర్‌తో మొత్తం గేమ్‌ను చేజార్చుకుంది. అది సిమర్‌జీత్ వేసిన పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌.

మ్యాచ్ ప్రారంభంలో షమీ, కమిన్స్ అద్భుతమైన స్పెల్స్‌తో గుజరాత్‌ను 28-2తో కట్టడి చేశారు. ఈ దశలో శుభ్‌మన్ గిల్ కాస్త ఒత్తిడిలో కనిపించగా, వాషింగ్టన్ సుందర్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. అయితే ఆ ఒత్తిడిని పూర్తిగా తొలగించినవాడు సిమర్‌జీత్ సింగ్. అతడు వేసిన ఆ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో గుజరాత్ ఒక్కసారిగా దూకుడు సాధించింది. ఆ ఓవర్‌లోనే గిల్ కు ఊపు దొరికింది. దీంతో SRH మ్యాచ్‌పై పూర్తిగా పట్టు కోల్పోయింది.

ఈ ఓవర్ తరువాత గుజరాత్ ఆటగాళ్లు మరింత ధైర్యంగా ఆడి స్కోర్‌ను అందుకోవడంలో ఆలస్యం చేయలేదు. షమీ తాను వేసిన ఓవర్లలో మెరుగ్గా రాణించినా.. మిగతా బౌలర్లు మ్యాచ్‌ను తిరిగివచ్చేలా చేయలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు సిమర్‌జీత్‌పై విరుచుకుపడుతున్నారు. “ఒక్క ఓవర్‌తో మ్యాచ్ నాశనం చేశావు”, “చేతిలో ఉన్న గేమ్‌ను వదిలేశావు” అంటూ ట్రోల్స్ పుట్టుకొచ్చాయి. ఐపీఎల్ వంటి ప్రెజర్ మ్యాచుల్లో ఇలా ప్రాథమిక లోపాలతో ఓ ఓవర్ కోల్పోవడమే ఓటమికి కారణమవుతుందని నిపుణుల అభిప్రాయం.

సిమర్‌జీత్ సింగ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 వేలంలో రూ.1.50 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 10 మ్యాచుల్లో 9 వికెట్లు తీసి మెచ్చుకోలేని ఈ బౌలర్.. ఈసారి SRH తరఫున అవకాశం దక్కించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ లో తప్పితే మిగతా ఫార్మాట్ లో అతను పెద్దగా రాణించింది లేదు. కేవలం చెన్నైతో ఆడిన కొన్ని మ్యాచ్ లలో మాత్రం కొద్దిగా రాణించగలిగాడు. ఇక ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లో రెండు వికెట్లు తీసినప్పటికి 3 ఓవర్లలో

 46 పరుగులు ఇచ్చాడు

కానీ ఇప్పటి ప్రదర్శన చూస్తే సన్‌రైజర్స్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. 2025 గుజరాత్ మ్యాచ్‌లో 1 ఓవర్ వేసి 20 పరుగులు ఇవ్వడం అతడి గణాంకాల్లో ఉండిపోతుంది. 1998లో జన్మించిన ఈ ఢిల్లీ బౌలర్ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నా, మ్యాచ్ ప్రెజర్‌లో తడబాటుకు గురవుతున్నాడు. అతడు తిరిగి ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయగలిగితేనే SRHకి మేలు జరుగుతుంది. మరి అతనిపై పెట్టిన ఈ నమ్మకాన్ని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ కొనసాగించతుందా లేదా అనేది చూడాల్సిందే.