మరణం అంచున ఉన్న వ్యక్తిని బ్రతికించిన AI

మానవాళికి కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగం ఎలా ఉంటుందో చాటి చెప్పే ఉదంతం ఇది. అమెరికాలో అరుదైన వ్యాధితో మరణం అంచున ఉన్న ఓ యువకుడికి, వైద్యులు గుణమెలేదని చేతులెత్తేయగా… ఏఐ మళ్లీ జీవాన్ని కలిగించింది. ఏఐ సాంకేతికత వైద్యరంగంలో ఎలా విప్లవాత్మక మార్పులు తెస్తుందో చెప్పే ఉదాహరణగా ఇది మారింది. అమెరికా వాషింగ్టన్‌కి చెందిన 33ఏళ్ల జోసెఫ్ కోట్స్ అనే యువకుడు ‘పోయెమ్స్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.

ఇది శరీరంలోని నాడీ వ్యవస్థ, గుండె, మూత్రపిండాలు వంటి భాగాలను పాడుచేస్తుంది. జోసెఫ్‌కు కాళ్లు, చేతులు చచ్చుబడిపోతుండగా, గుండె తక్కువ వేగంతో పనిచేయడం మొదలైంది. మూత్రపిండాలు కూడా విఫలమయ్యాయి. సంప్రదాయ వైద్యం ఫలించకపోవడంతో వైద్యులు నిరాశ చెందారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతుండగా, అతని ప్రియురాలు తారా మాత్రం చివరి ఆశగా ఏఐ వైద్యుల్ని ఆశ్రయించింది.

ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్ డేవిడ్ ఫెగిన్బామ్, ఆరోగ్య డేటాను ఏఐకి ఇచ్చి విశ్లేషించగా కొత్త చికిత్స మార్గాలు సూచించబడ్డాయి. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, స్టెరాయిడ్ల మిశ్రమంతో జోసెఫ్‌కు వైద్యం అందించాలని ఏఐ సూచించింది. ఈ విధానాన్ని అనుసరించి చికిత్స చేశారు. ట్రీట్మెంట్ మొదలైన వారం రోజుల్లోనే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. నాలుగు నెలల చికిత్స తర్వాత జోసెఫ్ పూర్తిగా కోలుకోవడమే కాకుండా, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌కు సైతం సిద్దంగా ఉన్నాడని వైద్యులు పేర్కొన్నారు.

ఈ ఘటన కృత్రిమ మేధ సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. జోసెఫ్ జీవితం ఏఐ వైద్యపద్ధతుల వల్లే నిలిచిందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విజయం ఎవరూ ఊహించని విధంగా వైద్యరంగాన్ని తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు… రేపటి వైద్యానికి మార్గదర్శకంగా నిలిచే సాక్ష్యం. మరి రానున్న రోజుల్లో AI ఇంకా ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.