టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటి వరకు ఎవరు చేయని పని తనదైన శైలిలో చేయాలని నిర్ణయించుకున్నాడు. గంభీర్ ఇటీవల బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) అధికారులతో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భారత జట్టు ఇకపై మరింత మెరుగయ్యేందుకు తనవంతు బాధ్యతను పూర్తిగా నెరవేర్చాలని ఆయన భావిస్తున్నాడు. ఇదే కారణంగా, భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు ఇండియా ‘ఏ’ జట్టుతో పర్యటించాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇంతకుముందు భారత క్రికెట్ చరిత్రలో ఏ ప్రధాన కోచ్ కూడా ఇండియా ‘ఏ’ జట్టుతో విదేశీ పర్యటనకు వెళ్లలేదు. రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి వంటి ప్రముఖ కోచ్‌లు సీనియర్ జట్టును మాత్రమే పర్యవేక్షించేవారు. అయితే గంభీర్ ఈ ట్రెండ్‌ను మార్చాలని భావిస్తున్నాడు. యువ ఆటగాళ్ల ప్రతిభను దగ్గరుండి పరిశీలించి, టీమిండియాకు సరైన బ్యాకప్‌ను సిద్ధం చేయడమే అతని ప్రధాన టార్గెట్. మున్ముందు రానున్న సిరీస్‌ల కోసం సరైన ఆటగాళ్లను ఎంపిక చేయడం, అవసరమైన మార్పులను చేయడం కోసం ఇది అవసరమని భావిస్తున్నాడు.
గంభీర్ ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు విఫలమైన తర్వాత తన అభిప్రాయాలను బీసీసీఐకి స్పష్టంగా తెలియజేశాడు. యువ క్రికెటర్లను సిద్ధం చేయడానికి ఇండియా ‘ఏ’ జట్టు పర్యటనలు మరింత పెంచాలని సూచించాడు. ప్రస్తుతం జరుగుతున్న ‘ఏ’ జట్టు టూర్‌ల సంఖ్య తక్కువగా ఉందని, వాటిని పెంచితేనే యువ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయికి త్వరగా అలవాటు పడతారని గంభీర్ నమ్ముతున్నాడు. బీసీసీఐ కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, తగిన విధంగా మార్పులు చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ సూచించిన కొత్త ఆటగాళ్లు జట్టుకు కీలకంగా మారి విజయాన్ని సాధించడంలో సహాయపడ్డారు. ముఖ్యంగా అక్షర్ తో చేసిన బ్యాటింగ్ ప్రయోగం బాగా ఉపయోగపడుతుంది. దీనితో, భవిష్యత్తులో గంభీర్ నిర్ణయాలు మరింత ప్రభావశీలంగా ఉండొచ్చని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యువ ఆటగాళ్లలోని టాలెంట్‌ను అర్థం చేసుకోవడానికి గంభీర్ స్వయంగా ‘A’ జట్టుతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకోవడం వెనుక ఇదే కారణం. టీమిండియా భవిష్యత్తును మరింత మెరుగుపరిచేందుకు గంభీర్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందన్నది చూడాలి.