ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలుపుతో భారత క్రికెట్ మళ్లీ చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టీమిండియాకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. శ్రీలంకతో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌తో హోమ్ టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటముల అనంతరం టీమిండియా స్థిరతపై ప్రశ్నలు వచ్చాయి.
కానీ ఫైనల్‌లో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంతో ఆ అనుమానాలకు తెరపడింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్ అనంతరం కోహ్లీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. విజయం అనంతరం మాట్లాడిన కోహ్లీ, జట్టు మంచి స్థితిలో ఉందని, సీనియర్లు యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం వల్లనే ఈ ఘనత సాధించామని తెలిపాడు.
“ఈ జట్టు విజయాలను అందుకునే అద్భుతమైన స్థాయిలో ఉంది. ఇది మా కష్టానికి ఇది ఫలితం. జట్టులోని ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలు నిర్వర్తించారు. శుభ్‌మన్, శ్రేయస్, రాహుల్ లాంటి ఆటగాళ్లు టీమ్‌ను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. మేము ఎప్పటికీ మద్దతుగా ఉంటాం” అంటూ కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇక రిటైర్మెంట్ ఊహాగానాల విషయానికి వస్తే, ఇప్పట్లో ఎవరూ అంతమొందే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది. 2027 వరల్డ్ కప్ వరకు తమ ప్రస్థానం కొనసాగుతుందనే సంకేతాలను కోహ్లీ ఇచ్చాడు. రోహిత్ శర్మ, జడేజా కూడా భవిష్యత్తుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో భారత క్రికెట్‌కు ఈ సీనియర్ ఆటగాళ్లు మరికొన్ని సంవత్సరాలు అండగా ఉంటారని అభిమానులు విశ్వసిస్తున్నారు.