భారత ఆర్మీకి బలమైన అస్త్రం.. రష్యాతో భారీ డీల్!

భారత రక్షణ రంగంలో మరో కీలక ఒప్పందం కుదిరింది. రష్యా ప్రభుత్వ సంస్థ రోసోబోరోన్ ఎక్స్‌పోర్ట్ (RoE)తో భారత్ 1,000 హార్స్‌ పవర్ (HP) సామర్థ్యం కలిగిన ట్యాంక్ ఇంజిన్ల కొనుగోలు కోసం 248 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఇంజిన్లు పూర్తిగా నిర్మితమైన, పూర్తిగా విడదీసిన, అర్ధ నిర్మిత రూపాల్లో లభించనున్నాయి. ఈ ఒప్పందం కింద, ఈ ఇంజిన్లను భారత్‌లో ఉత్పత్తి చేయడం కోసం రష్యా నుండి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కూడా జరగనుంది. చెన్నైలోని అవడి హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో ఈ ఇంజిన్ల అసెంబ్లీ, లైసెన్స్ ఉత్పత్తి కొనసాగనుంది.

ప్రస్తుతం భారత ఆర్మీలో కీలకంగా ఉన్న రష్యా తయారీ T-72 ట్యాంకులు 780 HP ఇంజిన్‌తో పనిచేస్తున్నాయి. తాజా ఒప్పందంతో, వీటిని 1,000 HP సామర్థ్యం గల ఇంజిన్లతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ మార్పుతో ట్యాంకుల వేగం, మెరుగైన మోబిలిటీ, అదనపు దాడి సామర్థ్యాలు పెరగనుండటంతో యుద్ధరంగంలో భారత్ మరింత బలపడనుంది. ఇప్పటికే భారత ఆర్మీలో 2,400 T-72 ట్యాంకులతో పాటు, 1,300 T-90S భీష్మ ట్యాంకులు ఉన్నాయి. మొత్తం 1,657 T-90S ట్యాంకులను భారతదేశంలో లైసెన్స్ ఉత్పత్తిగా తయారు చేస్తున్నారు.

T-72 ట్యాంక్‌లకు ఈ మెరుగైన ఇంజిన్‌లను అమర్చడంతో పాటు, దేశీయంగా అభివృద్ధి చేసిన అర్జున్ మార్క్-1A ట్యాంకులను కూడా భారత ఆర్మీకి అందిస్తున్నారు. 2021లో రూ.7,523 కోట్ల వ్యయంతో 118 అర్జున్ ట్యాంకుల కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. 14 ప్రధాన మార్పులు, 57 చిన్న మార్పులతో ఈ కొత్త వెర్షన్ ముందుగా తయారైన 124 అర్జున్ ట్యాంకులను మరింత ఆధునికంగా అప్‌గ్రేడ్ చేస్తుంది. వేగం, ఫైర్‌పవర్, రక్షణ, స్థిరత్వంలో మెరుగైన పనితీరును అందించేందుకు ఈ ట్యాంకులను రూపొందించారు.

భారత ఆర్మీ మరో ముఖ్యమైన ప్రాజెక్ట్ జొరావర్ కింద 354 లైట్ వెయిట్ ట్యాంకులను రూపొందిస్తోంది. రూ.17,500 కోట్ల వ్యయంతో హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ కోసం వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. తక్కువ బరువు (25 టన్నుల లోపు), అధిక పవర్ రేషియో, మెరుగైన ఫైర్‌పవర్ కలిగిన ఈ ట్యాంకులు తూర్పు లడఖ్‌లో చైనా సైన్యంతో కొనసాగుతున్న సుదీర్ఘ ప్రతిష్టంభన దృష్ట్యా అత్యవసరంగా అభివృద్ధి చేయబడుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారత రక్షణ రంగం మరింత శక్తివంతం అవుతోంది. నూతన ట్యాంక్ ఇంజిన్లతో కలిపి దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ట్యాంకులు భారత ఆర్మీకి భవిష్యత్‌లో మరింత బలం తెచ్చిపెట్టనున్నాయి.