ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు సిద్ధమయ్యాయి. భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని చూస్తుండగా, న్యూజిలాండ్ 2000 తర్వాత తమ రెండో టైటిల్‌ను అందుకోవాలని సిద్ధమవుతోంది.. అయితే ఈ మ్యాచ్ టై అయితే ఎవరికి కప్పు దక్కుతుంది? 2019 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుకు జరిగిన అన్యాయాన్ని మళ్లీ చూడాల్సి వస్తుందా? అనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠలో ముంచేస్తోంది.
ఈసారి టై జరిగితే 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో జరిగిన అన్యాయం పునరావృతం కాకుండా ఐసీసీ కొత్త నిబంధనలను అమలు చేసింది. మ్యాచ్ టై అయితే, తక్షణమే సూపర్ ఓవర్ జరిపి విజేతను నిర్ణయిస్తారు. కానీ, సూపర్ ఓవర్ కూడా టై అయితే? 2019 ప్రపంచ కప్‌లో కేవలం బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించినా, ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా వరుసగా సూపర్ ఓవర్లు జరిపి విజేతను ఖరారు చేసే విధానం అమలులోకి వచ్చింది. అంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టై అయితే ఎన్ని సూపర్ ఓవర్లు అయినా కొనసాగుతాయి, విజేత తేలే వరకూ మ్యాచ్ ఆగదన్నమాట.
మరోవైపు వర్షం వల్ల మ్యాచ్ పూర్తి కాకపోతే..
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగుతున్నా, పాకిస్థాన్ వేదికగా మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా నష్టపోయాయి. అయితే ఫైనల్‌కు వర్షం అంతగా ప్రభావం చూపే అవకాశం తక్కువ. అయినప్పటికీ, వర్షం కారణంగా మ్యాచ్‌ను పూర్తిగా నిర్వహించలేకపోతే, భారత్, న్యూజిలాండ్ జట్లు కలిసి ట్రోఫీని పంచుకుంటాయి. 2002లో శ్రీలంక, భారత్ ఫైనల్ కూడా ఇదే తరహాలో ముగిసిన విషయం తెలిసిందే.
ఇక భారత్ జట్టు ఈ టోర్నీలో ఇప్పటి వరకు తమ ఆటతీరుతో అద్భుతమైన ప్రదర్శన చూపించింది. వరుసగా మ్యాచ్‌లు గెలిచి దూసుకెళ్తున్న భారత బౌలర్లు, న్యూజిలాండ్‌ను మరోసారి కట్టడి చేయాలనుకుంటున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్లు తీసి రాణించగా, ఫైనల్‌లోనూ అతని స్పిన్ కీలకంగా మారనుంది. న్యూజిలాండ్ జట్టు కూడా సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించడంతో, ఈ మ్యాచ్‌లో సమగ్ర ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డెరిల్ మిచెల్ వంటి బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కొనడం ఎలా అనేదే కీలకం. వర్షం కలుగజేసుకోవడమో, లేదంటే మ్యాచ్ టై అవ్వడమో జరిగినా, ఈ ఫైనల్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.