ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో టీమిండియా విజయం సాధించాలంటే, కేవలం బలమైన ఆటతీరు కాకుండా వ్యూహాత్మకంగా కీలక ఆటగాళ్లను వెంటనే పెవిలియన్ పంపాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్ జట్టులో ఇద్దరు బలమైన ప్లేయర్స్ టీమిండియాకు ప్రధాన ఆటంకంగా మారనున్నారు. వాళ్లే కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర. ఈ ఇద్దరూ బ్యాటింగ్‌లో ఒకసారి కుదురుకుంటే, మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచే ప్రమాదం ఉంది. కనుక, భారత బౌలర్లు ఈ ఇద్దరినీ తొందరగా ఔట్ చేయడం చాలా కీలకం.
రచిన్ రవీంద్ర ఐసీసీ టోర్నీలకు పర్ఫెక్ట్ ప్లేయర్. గత ప్రపంచకప్‌లో మూడు సెంచరీలు చేసిన అతను, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై భారీ ఇన్నింగ్స్‌లు ఆడి, తన స్థిరతను నిరూపించాడు. అతను ఒకసారి కుదురుకుంటే, మ్యాచ్‌ను పూర్తిగా న్యూజిలాండ్ వశం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, స్పిన్, పేస్ ఏదైనా తేడా లేకుండా బ్యాటింగ్ చేయగలడు. అలాంటి ప్లేయర్‌ను తొలినాళ్లలోనే ఔట్ చేయకపోతే, భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.
కేన్ విలియమ్సన్ అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్. ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో జట్టును ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం కలిగిన ఆటగాడు. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసి, మిడిలార్డర్‌కు మద్దతుగా నిలిచాడు. భారత్‌తో లీగ్ మ్యాచ్‌లోనూ 81 పరుగులతో నిలకడగా ఆడి, జట్టుకు మద్దతునిచ్చాడు. అతని బ్యాటింగ్ స్టైల్ కేవలం స్ట్రైక్ రొటేట్ చేస్తూ మిగతా బ్యాట్స్‌మెన్‌కు స్థిరతను అందించడమే కాదు, అవసరమైన సమయంలో వేగంగా పరుగులు చేయడంలోనూ అతను దిట్ట. భారత్‌కు విజయావకాశాలు మెరుగుపడాలంటే, అతడిని తొందరగా ఔట్ చేయడం తప్పనిసరి.
ఈ ఇద్దరినీ తొందరగా పెవిలియన్‌కు పంపాలంటే, బౌలర్లు పొరపాట్లకు ఆస్కారం లేకుండా చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలి. మొదటి 15 ఓవర్లలోనే రచిన్ రవీంద్రను ఔట్ చేయడం టీమిండియాకు కీలకం. మరోవైపు, విలియమ్సన్‌ను నిదానంగా ఆడేలా ఒత్తిడి పెంచి, బౌలింగ్‌తో మోహరించాలి. ఒకసారి ఈ ఇద్దరిని ఔట్ చేయగలిగితే, మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ టీమిండియాకే ఉంటుంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ చేజారినట్లే. ఎందుకంటే ఈ ఇద్దరు అవుట్ అయితే మిగిలిన కివీస్ బ్యాట్స్‌మెన్ మీద ప్రెషర్ పెంచి, న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయవచ్చు. మరి టీమిండియా ప్రణాళికలు ఈసారి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.