అమెరికాలో H-4 వీసాతో ఉండే వేలాది భారతీయ యువత ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. చిన్నతనం నుంచి అక్కడే పెరిగి, చదువుకొని, జీవితాన్ని అక్కడే కొనసాగించాలని అనుకున్న వీరికి 21 ఏళ్ల వయస్సు అనంతరం తల్లిదండ్రుల H-1B వీసాపై ఆధారపడే అవకాశం ఉండదు. మునుపటి పాలసీల ప్రకారం వారికి రెండు సంవత్సరాల గడువు ఉండేది, కానీ తాజా వలస పాలసీ మార్పులతో ఆ అవకాశం తగ్గిపోతోంది. దీంతో చాలా మంది భారతీయ యువత స్వతహాగా అమెరికా విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి (self-deportation) ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం, అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం భారతీయులకు ఎదురయ్యే సమస్యం మరింత పెరిగింది. 2026 నాటికి సుమారు 1.34 లక్షల మంది భారతీయులు తమ వీసా స్టేటస్ కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. H-1B వీసా ప్రక్రియ కూడా మరింత కఠినతరంగా మారుతోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7 నుంచి 24 వరకు జరగనుంది. అయితే USCIS కొత్త ఎంపిక విధానం తీసుకురావడంతో, ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉంది. H-1B వీసా లిమిట్ కేవలం 65,000 మాత్రమే కాగా, అదనంగా 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ అభ్యర్థులకు ఇవ్వనున్నారు.
ఈ పరిస్థితులపై అమెరికా రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. సెనేటర్ బర్నీ శాండర్స్ H-1B వీసా విధానంపై విమర్శలు చేస్తూ, ఇది నిజంగా ప్రతిభావంతులను తీసుకొచ్చే విధానమా లేక తక్కువ జీతాలకు విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికేనా? అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన H-1B ఫీజులను రెట్టింపు చేసి, ఆ మొత్తాన్ని అమెరికన్ విద్యార్థుల కోసం ఉపయోగించాలని సూచిస్తున్నారు. అంతేకాదు, H-1B ఉద్యోగస్తులకు స్థానిక మధ్యస్థ వేతనం ఇవ్వాలని, తద్వారా అమెరికన్ ఉద్యోగులను అవమానించే విధంగా తక్కువ జీతాలకే విదేశీయులను నియమించడాన్ని అడ్డుకోవాలని ఆయన చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో భారతీయ యువతకు భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. మరికొంత మంది కెనడా, యూకే వంటి దేశాలకు వలస వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. అమెరికాలో వలస పాలసీ మరింత కఠినతరమైన నేపథ్యంలో, భారతీయులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వీసా బ్యాక్లాగ్, గ్రీన్ కార్డ్ ఆలస్యం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న భారతీయులు, ఇప్పుడు కొత్త వలస కఠినతలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.