అమెరికాలో 12 ఏళ్లు గడిపిన ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భారత్‌కి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే, ఊహించని సమస్య ఎదురైంది. భారతీయ ఐటీ పరిశ్రమలో ఉద్యోగం పొందడం కష్టంగా మారింది. మిషిగన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన ఈ టెకీ, గత 9 ఏళ్లుగా అమెరికాలో ఫుల్ స్టాక్ డెవలపర్‌గా పనిచేశాడు. పైథాన్, డీజాంగో, జావాస్క్రిప్ట్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ లాంటి టెక్నాలజీలలో అనుభవం ఉన్నా, కొత్తగా వచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్, డోకర్, కుబెర్నేటిస్ వంటి టూల్స్‌పై అనుభవం లేకపోవడంతో ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు.
అతని తల్లి ఆరోగ్య సమస్యలు, తండ్రి వయసు 78 ఏళ్లు కావడంతో, కుటుంబ బాధ్యతల దృష్ట్యా మే నెలలో భారత్‌కు తిరిగి వచ్చే నిర్ణయం తీసుకున్నాడు. అయితే గత ఆరు నెలలుగా భారత్‌లో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నప్పటికీ, కేవలం ఒక ఇంటర్వ్యూకే అవకాశం వచ్చింది. కానీ, అక్కడ కూడా విఫలమయ్యాడు. పరిశ్రమలో మారుతున్న ట్రెండ్‌లను అనుసరించలేకపోవడం, పెద్దస్థాయి స్కేలబుల్ అప్లికేషన్లపై అనుభవం లేకపోవడం కారణంగా తాను పోటీలో వెనుకబడి పోతున్నానని భావిస్తున్నాడు.
ఈ సమస్యను రెడిట్ వేదికగా పంచుకున్న అతనికి ఇంటర్నెట్ నుంచి మద్దతు లభించింది. చాలా మంది అతని అనుభవాన్ని అమూల్యమైనదిగా అభిప్రాయపడుతూ, మరింత అప్ స్కిలింగ్ చేసి ఇండస్ట్రీ డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా, ఫ్రీలాన్స్, రిమోట్ జాబ్స్ ద్వారా ఉద్యోగానుభవాన్ని మెరుగుపరుచుకోవడం, ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీలతో నెట్‌వర్కింగ్ చేసుకోవడం, స్టార్టప్‌లను టార్గెట్ చేయడం వంటి ఆలోచనలను సూచించారు.
కొంతమంది అతనికి ముందుగా అమెరికాలో పని చేస్తున్న కంపెనీల్లోనే ఇండియా బ్రాంచ్‌కి బదిలీ కోసం ప్రయత్నించాలని సూచించారు. మరోవైపు, ఎక్స్-కోలీగ్స్‌ను సంప్రదించడం, ఇండస్ట్రీలో పరిచయాలను పెంచుకోవడం కూడా ఉపయుక్తమని పేర్కొన్నారు. ఉద్యోగ నిపుణుల సూచనల ప్రకారం, మారుతున్న టెక్నాలజీలపై పట్టుసాధించి, నెట్‌వర్కింగ్ పెంచుకుంటే, భారత్‌లో మంచి అవకాశాలు దొరికే అవకాశాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు.