ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అదే ఆసీస్ చేతిలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఆ తప్పును సరిదిద్దుకుంటూ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ అర్ధశతకాలు బాదినా, మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలింగ్ దళం క్రమంగా కట్టడి చేస్తూ ఆసీస్ పరుగుల వరదను ఆపేసింది. షమీ 3 వికెట్లు తీసి చక్కటి ప్రదర్శన చేశాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా ఇద్దరూ కలిసి కీలకమైన వికెట్లు పడగొట్టారు.
లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయి కొంత తడబడినప్పటికీ కోహ్లీ స్మార్ట్ ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 84 పరుగులతో మరోసారి తన క్లాస్‌ను చాటాడు. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42), హార్దిక్(28) కీలక సమయంలో అందించిన మద్దతు గెలుపును మరింత సులభం చేసింది. చివరికి 48.1 ఓవర్లలో భారత్ విజయాన్ని అందుకుంది.
ఈ గెలుపుతో భారత్ మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపి ఫైనల్‌కు చేరింది. మార్చి 9న దుబాయ్ వేదికగా తుది పోరు జరగనుంది. బుధవారం న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుండగా, విజేత జట్టుతో భారత్ ఫైనల్‌లో తలపడనుంది. వరుసగా ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌కి చేరడం భారత జట్టుకు గర్వించదగిన విషయం. ఇక ఫైనల్ లో కూడా టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా అదే ప్రణాలికతో జట్టును కొనసాగించే అవకాశం ఉంది.