ఇడ్లీ సాంబార్ అమ్మటం వల్లే గోవాకు విదేశీయులు రావట్లేదు

గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారటంతో పాటు.. మరీ ఇంత అతి అవసరమా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన గోవా పర్యాటకానికి దెబ్బ పడిందని..గతంలో పోలిస్తే విదేశీ టూరిస్టులు రావటం తగ్గినట్లుగా పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. విదేశీ పర్యాటకులు రాకపోవటానికి కారణం.. బీచ్ లలో ఇడ్లీ సాంబార్ అమ్మటం అంటూ చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరంగా మారాయి.

నార్త్ గోవాలోని కలంగూట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో.. “బెంగళూరు నుంచి వచ్చిన వారు బీచ్ దుకాణాల్లో వడా పావ్ లు అమ్ముతున్నారు.మరికొందరు ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారు. అందుకే గడిచిన రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది” అని పేర్కొన్నారు. ఇంత మాట్లాడిన పెద్ద మనిషి.. ఇడ్లీ సాంబార్.. వడా పావ్ అమ్మటానికి విదేశీ పర్యాటకులు తగ్గటానికి మధ్య ఉన్న లింకేమిటో మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం.

అయితే.. గోవాకు విదేశీ పర్యాటకులు తగ్గటానికి అనేక కారణాలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ – రష్యా టూరిస్టులు గోవాకు రావట్లేదని చెప్పారు. ఫారిన్ టూరిస్టులు గోవాకు రాకపోవటానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదన్న ఆయన.. దీనికి అందరూ బాధ్యులేనని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా వాసులు తమ షాపుల్ని అద్దెకు ఇవ్వటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గటానికి దారి తీసిన కారణాల్నిఅన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ట్యాక్సీలు.. క్యాబ్ ల మధ్య కూడా అనేక సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని లేదంటే గోవా టూరిజంకు చీకటి రోజులు ఖాయమన్న ఆయన వార్నింగ్ ఇప్పుడు అందరూ అలెర్టు అయ్యేలా మారిందని మాత్రం చెప్పక తప్పదు.