న్యాయపరంగా పిల్లల సాక్ష్యం ఎంత వరకు నమ్మదగినదో అనే అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన హత్య కేసులో ఏడేళ్ల బాలిక ఇచ్చిన సాక్ష్యాన్ని న్యాయస్థానం ప్రామాణికంగా గుర్తించి, నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో ముద్దాయి తన భార్యను హత్య చేసినప్పుడు చిన్నారి అక్కడే ఉండగా, ఆమె చెప్పిన వివరాలను తొలుత హైకోర్టు తోసిపుచ్చింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం చిన్నారి వాఖ్యలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు తీర్పును రద్దు చేసింది.
సాక్ష్య చట్టంలో వయస్సుకు పరిమితి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల ద్వారా వచ్చిన సాక్ష్యాన్ని నేరుగా తిరస్కరించలేమని న్యాయమూర్తులు తెలిపారు. అయితే, పిల్లలు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, కోర్టులు అత్యంత జాగ్రత్తగా అటువంటి సాక్ష్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారులు ఇతరుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అందుకు తగిన ఆధారాలు లేకుంటే వారి వాఖ్యాలను పూర్తిగా తిరస్కరించకూడదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
చిన్నారి ఇచ్చిన వాఖ్యాలు సహజమైనవా? లేక ఎదుటివారి ప్రభావం వల్ల చెప్పించబడ్డాయా? అనే అంశాన్ని కోర్టులు వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిల్లల సాక్ష్యం అంతుచిక్కని సమస్యగా మారితే, కోర్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లల ద్వారా వచ్చిన సాక్ష్యానికి తప్పనిసరిగా మరో వ్యక్తి మద్దతుగా ఉండాలని నిబంధన లేదని, కానీ అవసరమైన సందర్భాల్లో అదనపు రుజువులను పరిశీలించడం మంచిదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
మొత్తానికి, పిల్లలు న్యాయపరంగా సాక్ష్యంగా నిలబడే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా సమర్థించింది. కానీ, కోర్టులు ఆ సాక్ష్యాన్ని అర్ధం చేసుకోవడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. చిన్నారులను ప్రభావితం చేయకుండా, వారి వాఖ్యాలు నిజాయితీగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పు, భవిష్యత్‌లో చిన్నారుల సాక్ష్యంపై కోర్టుల వైఖరికి స్పష్టతనిస్తుంది.