అసలే బర్డ్ ఫ్లూతో చికెన్ విక్రయాలు పూర్తిగా కాకున్నా… 50 శాతానికి పైగానే పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ అమ్మకాలు పూర్తిగానే పడిపోయాయి. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తింటే ఆ వ్యాధి సోకుతుందా? అంటే… లేదనే చెప్పాలి. అయితే మనిషిలోని భయం చికెన్ షాపుల వద్దకు అడుగులు పడనియ్యడం లేదు. అయితే అదే చికెన్ ఫ్రీ వస్తోందంటే… మాత్రం భయం ఇట్టే ఎగిరిపోతోంది. కిలో మీటర్ల మేర బారులు ఉన్నా… గంటల తరబడి నిలబడి అయినా ఆ ఫ్రీ చికెన్ ను ఆస్వాదించాలని మనసు ఆరాటపెడుతోంది. ఫలితంగా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తెర మీదకు వస్తున్న ఫ్రీ చికెన్ వంటకాల వద్ద భారీగా జనం బారులు తీరుతున్నారు.
ఈ తరహా జనం బారులు నిన్న గుంటూరులో కనిపించాయి. గుంటూరులో ఫ్రీ చికెన్ పేరిట… చికెన్ బిర్యానీతో పాటుగా ఫ్రీ ఎగ్ బిర్యానీలు అంటూ ఓ హోటల్ ప్రకటించింది. అంతే ఈ మాట ఆ నోటా, ఈ నోటా క్షణాల్లో నగరమంతా పాకిపోయింది. ఇంకేముంది క్షణాల్లో ఆ హోటల్ ముందు జనం బారులు తీరారు. గంటల కొద్దీ బారుల్లో నిలబడి మరీ చికెన్, ఎగ్ బిర్యానీలను అందుకుని ఇష్టంగా ఆరగించారు. ఈ దృశ్యాలతో కూడిన వీడియోలు శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ గా మారగా… ఆ వార్తలు మెయిన్ మీడియాలోనూ పతాక శీర్షికలను ఎక్కాయి. సరిగ్గా… అలాంటి దృశ్యాలే ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ప్రత్యక్షమయ్యాయి. ఈ జనం బారులకు నగరంలోని ఉప్పల్ వేదికగా నిలిచింది.
ఉప్పల్ పరిధిలోని గణేశ్ నగర్ లో కొందరు ఔత్సాహికులు ఫ్రీ చికెన్, ఎగ్ మేళా పేరిట ఉచితంగా చికెన్, ఎగ్ వంటకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ వార్తలు తెలిసినంతనే జనం అక్కడికి తండోపతండాలుగా వచ్చి చేరారు. చూస్తుండగానే అర కిలో మీటర్ మేర జనం బారులు తీరారు. జనాన్ని చూసి ఏమాత్రం నివ్వెరపోని ఫ్రీ నిర్వాహకులు.. వచ్చిన వారందరికి చికెన్ కావాలంటే చికెన్, ఎగ్ కావాలంటే ఎగ్ అందించారు. మరింత మేర కావాలంటే.. మళ్లీ లైన్ లో రావాలని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ కొనేందుకు భయపడిపోతున్న జనం… ఫ్రీ చికెన్, ఎగ్ అంటే ఏమాత్రం భయం లేకుండానే ఎగబడిపోతున్నారని ఈ వీడియోలను చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates