ఓ చిన్నారి బాలిక… 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక స్వదస్తూరితో రాసిన ఓ లేఖ జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపిందర్ గోయల్ ను నిజంగానే సూపర్ ఎగ్జైట్ మెంట్ కు గురి చేసింది. ఫుడ్ డెలివరీలో నిత్యం బిజీబిజీగా ఉండే గోయల్..ఆ 8వ తరగతి బాలిక రాసిన లేఖను చూసి మురిసిపోయారు. ఆ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫీడింగ్ ఇండియా పేరిట తాను కొనసాగిస్తున్న కార్యక్రమంతో ఎంతో మంచి జరుగుతోందని చెప్పారు. ఆ మంచికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. అంతేకాకుండా… తమ సంస్థ యాప్ లో పీడింగ్ ఇండియా విభాగంలోకి వెళ్లి… మీరు చేసిన సాయం వల్ల ఎంతమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారో తెలుసుకోండి అంటూ సలహా కూడా ఇచ్చారు.
ఫీడింగ్ ఇండియా పేరిట విరాళాలు సేకరిస్తున్న జొమాటో… దేశంలో తాను దత్తత తీసుకున్న చాలా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పిల్లలకు భోజనాన్ని అందిస్తోంది. ఇలా జొమాటో నుంచి సాయం అందుకున్న చమన్ ఝాన్సీ అనే 8వ తరగతి బాలిక తాజాగా గోయల్ ఉదాత్తతను అభినందిస్తూ… కొనియాడుతూ ఓ లేఖ రాసింది. మీరు అందిస్తున్న సాయం ఎనలేనిదని, తనలాంటి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతోందని ఆ బాలిక తెలిపింది. ప్రస్తుతం తాను మీ సహాయం తీసుకుంటూ చదువుకుంటున్నానని.. తాను పెద్దయ్యాక మీ మాదిరే అవసరంలో ఉన్నవారికి సాయం అందిస్తానని తెలిపింది. ఈ లేఖను చూసినంతనే ఉబ్బితబ్బిబ్బయిన గోయల్.. సదరు లేఖను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జొమాటో చేపట్టిన ఫీడింగ్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇప్పటిదాకా 19 కోట్ల బోజనాలను పిల్లలకు అందించగలిగామని గోయల్ చెప్పుకొచ్చారు. ఇందుకు జొమాటో వినియోగదారుల సహకారమే కారణమని తెలిపారు. వినియోగదారుల దాన గుణం మరువలేనిదని కూడా ఆయన కీర్తించారు. చమన్ ఝాన్సీ లేఖ తనను ఎంతగానో ఎగ్జైట్ చేసిందని చెప్పిన గోయల్… జొమాటో యాప్ లో ఫీడింగ్ ఇండియా విభాగంలోకి వెళ్లి పిల్లల అనుభవాలను వినాలని ఆయన వినియోగదారులను కోరారు. అలా చేస్తే… మీ దానం ఎంతమంది పిల్లలకు చేరిందో తెలుస్తుందని… ఆత్మ సంతృప్తి కలుగుతుంతని కూడా గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates