ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండే వ్యక్తే వారి పిల్లాడిని కిడ్నాప్ చేశాడు. పిల్లాడిని విడిచిపెట్టాలంటే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతను కోరినట్లే డబ్బులివ్వడానికి కూడా ఆ కుటుంబం సిద్ధమైంది. ఐతే డబ్బులు తీసుకునేందుకు వచ్చిన కిడ్నాపర్ పోలీసులకు దొరికిపోయాడు. అంతటితో కథ సుఖాంతం అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో దారుణమైన విషయం బయటపడింది. పిల్లాడిని తీసుకెళ్లిన రెండు గంటల్లోనే చంపేశాడా దుర్మార్గుడు. కానీ ఆ విషయం చెప్పకుండా డబ్బుల కోసం బాధిత కుటుంబానికి ఫోన్లు చేశాడు. మహబూబ్ నగర్‌కు చెందిన దీక్షిత్ రెడ్డికి సంబంధించిన విషాదాంతమిది.
రెండు రోజుల కిందట ఈ బాలుడి కిడ్నాప్ గురించి మీడియాలో బాగానే హడావుడి జరిగింది. కిడ్నాపర్ పోలీసులకు దొరుకుతాడో లేదో కానీ.. పిల్లాడు క్షేమంగా బయటికి వస్తే చాలని అంతా అనుకున్నారు. వస్తాడనే ఆశతోనే ఉన్నారు. కానీ ఎవరూ ఊహించనిది జరిగింది. బాధిత కుటుంబంతో సన్నిహితంగా మెలిగే బైక్ మెకానిక్ అయిన మంద సాగరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి దీక్షిత్‌తో మంచిగా మాట్లాడి బైక్‌లో తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు సాగర్. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీలు లేని మార్గంలోనే అతను పిల్లాడిని తీసుకెళ్లడం గమనార్హం. అయినా సరే.. ఒక చోట సీసీటీవీలో బైక్‌పై దీక్షిత్‌ను తీసుకెళ్తున్న దృశ్యం రికార్డయింది.
దీక్షిత్‌ను ఇలా తీసుకెళ్లిన సాగర్.. అతను ఇంటికి వెళ్లాలని గొడవ చేసినపుడు కంగారులో చంపేసి ఉంటాడని భావిస్తున్నారు. నిద్ర మాత్రలు మింగించి గొంతు పిసికి చంపేసిన సాగర్.. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఐతే సాధారణ బైక్ మెకానిక్ అయిన సాగర్.. పోలీసులకు దొరక్కుండా ఫోన్ చేసి బాధిత కుటుంబాన్ని బెదిరించిన వైనం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
యుఎస్‌లో రిజిస్టర్ అయిన ‘డింగ్ టోన్’ అనే యాప్ ద్వారా అతను కాల్ చేయగలిగాడు. కిడ్నాపర్ నుంచి కాల్స్ వచ్చినపుడు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించలేకపోయారు. ఆ యాప్‌లో సాగర్ తన స్నేహితుడి ఫోన్‌కు ఓటీపీ పంపించుకుని లాగిన్ అవ్వడంతో అతణ్ని పట్టుకోవడం పోలీసులకు కష్టమైంది.
ముందు ఒకసారి డబ్బుల కోసం చెప్పిన ప్రదేశానికి రాకుండా ఆగిపోయిన సాగర్.. రెండోసారి చెప్పిన చోటుకు వచ్చి అక్కడ మాటు వేసి ఉన్న పోలీసులకు దొరికిపోయాడు. ఐతే పిల్లాడిని తీసుకెళ్లిన రెండు గంటల్లోనే చంపేయడంతో నిందితుడిని పట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఐతే ఈ కేసు పోలీసులకు సవాలుగా తయారైన నేపథ్యంలో కిడ్నాపర్లకు వరంలా మారే ‘డింగ్ టోన్’ లాంటి యాప్‌లన్నింటినీ నిషేధించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది.