ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ కోసం దుబాయ్ వేదికగా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నా, బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయలేమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ జర్నిలో అనేక రికార్డులను అందుకునే అద్భుత అవకాశాన్ని ఎదుర్కొంటున్నాడు.
రోహిత్ శర్మ కేవలం 12 పరుగులు చేస్తే, వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత ఆటగాడు అవుతాడు. అంతేకాదు, ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని 10వ ఆటగాడిగా కూడా రికార్డులకెక్కుతాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు ఇప్పటికే స్థానం సంపాదించుకున్నారు. రోహిత్ ఈ మైలురాయిని సాధించడం పెద్ద ఘనతగా భావించబడుతోంది.
ఇక హిట్‌మ్యాన్ మరో 12 పరుగులు చేసి ఈ ఘనతను సాధిస్తే, విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా 11,000 వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును సాధించగా, రోహిత్ 260 ఇన్నింగ్స్‌లతో ఆ గరిష్టానికి చేరువలో ఉన్నాడు. ఇది రోహిత్ కెరీర్‌లో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుంది.
రోహిత్ శర్మ మరో సెంచరీ సాధిస్తే, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు ప్రపంచకప్‌ల్లో బంగ్లాదేశ్‌పై శతకాన్ని నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతానికి రోహిత్ ఖాతాలో 49 శతకాలు ఉన్నాయి, ఈ సెంచరీతో కోహ్లీ, సచిన్ లాంటి లెజెండ్స్ జాబితాలో చేరతాడు.
అలాగే ఈరోజు టీమిండియా బంగ్లాదేశ్‌ను ఓడిస్తే, రోహిత్ శర్మ కెప్టెన్‌గా 100 అంతర్జాతీయ విజయాలు సాధించిన నాలుగో భారత సారథిగా నిలుస్తాడు. మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనతను అందుకోవడం రోహిత్ కెరీర్‌కు మరొక గొప్ప సాధనగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద, ఈరోజు మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో మైలురాళ్లతో నిండిన రోజు కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates