ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉందంటే?

పాకిస్థాన్ లో క్రికెట్ ఆడాలి అంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాక్, ఈ అవకాశం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. సెక్యురిటీ విషయంలో బలాన్ని చూపించుకోవాలి అని పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనంత హడావుడి చేస్తోంది.

కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను పునరుద్ధరించి ఆధునీకరించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టోర్నీ నిర్వాహణలో భద్రతకు కూడా పెద్దపీట వేసింది. మొత్తం 18 మంది సీనియర్ అధికారులతో పాటు 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 10,556 మంది కానిస్టేబుళ్లు, 1,200 మంది సబ్ ఆర్డినేట్లు భద్రతా ఏర్పాట్లలో భాగమయ్యారు.

వీటితోపాటు ప్రత్యేకంగా 200 మంది మహిళా పోలీసులు కూడా నియమించబడ్డారు. ఆటగాళ్లు, ఇతర ప్రముఖుల కోసం 9 ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఈ విమానాలు నడుస్తాయి. పాక్ ప్రభుత్వం కూడా ఈ ఈవెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ, అన్ని విభాగాలను సమన్వయం చేస్తోంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. టోర్నీ మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి.

పాకిస్థాన్‌తో పాటు దుబాయ్ కూడా మ్యాచ్‌లకు వేదిక అవుతోంది. టీమిండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడనుంది. ఫిబ్రవరి 17న మొదలైన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ మార్చి 9న ముగుస్తుంది. తొలి మ్యాచ్ కరాచీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడగా, ప్రేక్షకుల హోరాహోరీ కలకలం రేపింది. అయితే పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత జట్టు దుబాయ్‌నే వేదికగా ఎంచుకోవడం విశేషం.