లవర్ బ్లాక్ చేస్తే పోలీసు కాల్ చేస్తారా…

ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే… చాలా వింతగా అనిపిస్తోంది. ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియడం లేదు. ఇక యువత విషయానికి వస్తే.. తామేం చేస్తున్నారో, తమ చర్యలు సమాజానికి ఎలాంటి మెసేజ్ లు ఇస్తాయోనన్న ఆలోచన కూడా వారికి ఉండటం లేదు. అయినా ఎవరేం అనుకుంటే… తమకేంటీ తమ సమస్య పరిష్కారం కావాలంతే అన్న ధోరణిలో వారు సాగుతున్న తీరు నిజంగానే విస్తుగొలుపుతోంది.

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ కాలేజీ యువతి గురువారం తన ఫోన్ తీసుకుని నేరుగా డయల్ 100కు కాల్ చేసింది. అవతలి నుంచి పోలీసులు కాల్ లిఫ్ట్ చేయగానే… ఆమె బోరుమంటూ తన బాధను వెళ్లగక్కింది. ఆపై ఆమె చేసిన ఫిర్యాదును చూసి…దానిపై ఎలా స్పందించాలో కూడా తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అయినా సదరు యువతి ఫిర్యాదు ఏమిటో తెలుసా?.. ఆ యువతి ఫోన్ నెంబర్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసేశాడట. తక్షణమే ఆ అబ్బాయి తన నెంబర్ ను అన్ బ్లాక్ చేసేలా చూడాలని సదరు యువతి కోరింది.

అసలే కాలేజీకి వెళుతున్న యువతి కదా. ఆమె ఫిర్యాదుపై ఎలా స్పందించాలో తెలియని పోలీస్ కంట్రోల్ రూం సిబ్బంది ఆ సమాచారాన్ని గుత్తి పోలీస్ స్టేషన్ కు పంపారట. ఈ ఫిర్యాదును తీసుకుని బయలుదేరిన ఓ కానిస్టేబుల్ సదరు యువతి ఉన్న గుత్తి రైల్వే స్టేషన్ ప్రాంతానికి బయలుదేరారట. అక్కడికి వెళ్లి సదరు యువతికి కాల్ చేస్తే… అబ్బే మీరేమీ మా ఇంటికి రానక్కరలేదు. తన బాయ్ ఫ్రెండ్ తో తన నెంబర్ ను అన్ బ్లాక్ చేయిస్తే చాలంటూ చెప్పిందట. దీంతో ఖంగుతిన్న ఆ కానిస్టేబుల్ ఆ యువతి చెప్పిన బాయ్ ఫ్రెండ్ నెంబర్ కు ఫోన్ చేయగా..ఆ అబ్బాయి ఆ కాల్ ను లిఫ్ట్ చేయలేదట. ఇలాగైతే కాదని భావించిన సదరు కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలంటూ సదరు యువతికి చెప్పేసి వెళ్లిపోయారట.